ప్రజాశక్తి-సంతనూతలపాడు : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులను తగ్గించి వ్యవసాయాన్ని దివాలా తీయించి కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తోదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బంకా సుబ్బారావు విమర్శించారు. మండలంలోని పేర్నమిట్టలో గ్రామ సిపిఎం శాఖ ఆధ్వర్యం లో బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పశు వైద్యశాల వద్ద ఆదివారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భం గా బంకా సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాజ ధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిర్వాసితుల సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించక పోవడం దుర్మార్గమని అన్నారు. వ్యవసాయ రంగానికి నిధులు కోత కోస్తోందని, ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గిస్తోంద న్నారు. వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని, విభజన హామీలను అమలు చేయకుం డా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆయన అన్నారు. కార్మిక హక్కులు కాల రాస్తూ నాలుగు లేబర్ కోడ్లు అమల్లోకి తేవడం కార్మికుల ను బానిసలుగా మార్చడమేనని విమర్శించారు. సామా న్యులకు బడ్జెట్లో కోతల కోస్తూ రెండోవైపు ప్రజల మీద భారాలు మోపుతూ, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ సంపద మొత్తాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా బడ్జెట్ ఉందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి అన్ను వెంకట సుబ్బారావు, నాయకులు దాసరి చిన్నబాబు, తుళ్లూరు సుబ్బారావు, ఉంగరాల రామకృష్ణ, కోడూరి రామకృష్ణారెడ్డి, ఆముదాల కోటేశ్వరరావు, బివి రమణారావు, జూపూడి వీరనారాయణ, డి వెంకటేశ్వర్లు, ఎల్ తిరుపతయ్య, శానం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
