రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్‌ ను వ్యతిరేకిస్తూ … సిపిఎం నిరసన

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఆంధ్ర రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్‌ ను ప్రజలు వ్యతిరేకించాలని సిపిఎం నేతలు పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌ ను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్‌ టి సి కాంప్లెక్స్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఏ.జగన్మోహనరావు, పి.రమణమ్మ లు మాట్లాడుతూ … తెలుగు మహిళ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌ మన రాష్ట్రానికి బడ్జెట్‌ కేటాయింపులు లో తీవ్ర అన్యాయం చేసిందన్నారు. విశాఖ ఉక్కు కు గత బడ్జెట్‌ కంటే నిధులు తగ్గించందన్నారు. మన జిల్లాలో ఏర్పాటు చేసిన గిరిజన యూనివర్సిటీ కి నిధులు కేటాయింపు చేయకపోవడం అన్యాయమన్నారు. పోలవరం నిర్వాసితులకు నిధులు కేటాయించలేదన్నారు. నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించే విధంగా బడ్జెట్‌ లో లేదన్నారు. ఉపాధి హామీ పథకానికి గత బడ్జెట్‌ కంటే కేటాయింపులు తగ్గించి ఉపాధి కూలీలకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. రైల్వే జోన్‌,విభజన చట్టంలోని అంశాల గురుంచి కనీస ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. భీమా రంగంలో 100 శాతం ఎఫ్‌ డి ఐ నీ అనుమతుంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎస్సీ,ఎస్టీ మహిళలకు,బాలల రక్షణకు నిధులు భారీగా తగ్గించడం అన్యాయమన్నారు. పేదలకు,సామాన్యులకు భారాలు పెంచే బడ్జెట్‌ ,ఒక్క శాతం ఉన్న కార్పొరేటర్లు 15 శాతం రాయితీ కల్పించి కార్పొరేట్లు కోసం మేము ఉన్నామని మరో మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌ ద్వారా నిరూపించుకుందన్నారు. అన్ని విధాలా ప్రజలకు,రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసే బడ్జెట్ను ప్రజలు వ్యతిరేకించాలని కోరారు.అదే విధంగా కూటమి ప్రభుత్వం లో ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ లు రాష్ట్రానికి కేటాయింపులపై కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు.నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి.రమణ, వి.లక్ష్మి, రామచంద్రరావు, రాము పార్టీ కార్యకర్తలు పాల్గన్నారు.

➡️