స్పందించిన రక్షణ దళాలు – తప్పిన పెను ప్రమాదం

ప్రజాశక్తి-కుప్పం టౌన్‌ (చిత్తూరు) : ప్రమాద సమాచారాన్ని అందుకున్న వెంటనే రక్షణ దళాలు స్పందించడంతో కుప్పం పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. పలమనేరు క్రిష్ణగిరి జాతీయ రహదారి, కుప్పం బైపాస్‌ రోడ్డు బైరుగానిపల్లి కూడలి వద్ద ఆగి ఉన్న వాహనం నుండి మంటలు వచ్చాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే సమాచారాన్ని స్థానిక పోలీసులకు అగ్నిమాపక శాఖ అధికారులకు చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక వాహనంతో ఘటన స్థలానికి చేరుకుని అతి కష్టంపై మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. సమయానుకూలంగా రక్షణ దళాలు స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని, అంతర్రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారిపై ప్రతినిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటుందని, అగ్నిప్రమాదం అదుపుతప్పి ఉంటే అందువల్ల జరిగే నష్టం ఊహించడానికి భయం వేస్తుంది అంటూ స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి స్పందించిన పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

➡️