మునిసిపల్‌ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి : సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్‌

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్య) : మునిసిపల్‌ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్‌ కార్యాలయాల వద్ద చేపడుతున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా సోమవారం మున్సిపల్‌ కార్మికులతో కలిసి పురపాలక కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ పట్టణాల విస్తరణ మేరకు కార్మికుల సంఖ్య పెంచాలని, కార్మికులకు పనిముట్లు, రక్షణ పరికరాలు అందజేసి భద్రతా సౌకర్యాలు కల్పించాలని అన్నారు. తుప్పు పట్టిన వాహనాలు మరమ్మతులు చేయించాలని, కార్మికులకు చట్టబద్ధమైన సెలవులు అమలు చేయాలని కోరారు. పిఎఫ్‌, ఈఎస్‌ఐ లోపాలను సరిదిద్దాలని, ఇంజనీరింగ్‌ కార్మికులకు, క్లాప్‌ డ్రైవర్లకు జీవో నెంబర్‌ 36 అమలు చేయాలని, మరణించిన కార్మికుల స్థానాలలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పీ.వీ రమణ, కార్మిక నాయకులు ఎం.వి రమణ, జి.గంగయ్య, ఎం.గంగయ్య, రత్నాలు, సురేష్‌, ఎం.రెడ్డి, నానమ్మ, లక్ష్మీదేవి, రవి తదితరులు పాల్గొన్నారు.

➡️