ప్రజాశక్తి – సీతంపేట : ఆదివాసులు శ్రమించి సేకరించిన అటవీ ఉత్పత్తుల్లో చింతపండు ఒకటి. ఈ ఏడాది అకాల వర్షాలకు పువ్వు రాలిపోవడంతో సగానికి సగం చింతపండు కాపు తగ్గిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సరైన మార్కెట్ ధర లేకపోవడంతో గిరిజనులు సంతల్లో కావడిలతో తీసుకొచ్చే చింత పండును తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోంది.సీతంపేట ఏజెన్సీ చింతపండు అంటే మైదాన ప్రాంత వ్యాపారులు ప్రజలు చెవి కోసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ చింతపండు ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా ప్రకృతి సహజ సిద్ధంతోనే కాపుకు వస్తుంది. ఏజెన్సీలో చింతపండు ఖర్జూరం మాదిరిగా రంగు, పుల్ల పుల్లగా, తీయతీయగా నాణ్యమైంది దొరుకుతుంది. అందుకే మైదాన ప్రాంతంలో పండిన చింతపండు కంటే ఏజెన్సీలో పండిన చింతపండుకు మంచి గిరాకీ పలుకుతుంది. ఏజెన్సీలో సుమారు పదివేల ఎకరాల వరకు ఏటా పంట కాపునకు వచ్చినప్పటికీ ఈ ఏడాది అకాల వర్షాలు కురవడంతో కొంతమేర పంట తగ్గింది. గిరిజనులు సేకరించిన చింతపండు సంతకు తెచ్చి కావిడి లెక్క చొప్పున విక్రయిస్తున్నారు. కావిడి చింత పండు ధర వెయ్యి రూపాయలు పలుకుతుంది. కావిడి చింతపండు కనీసం 30 కేజీల వరకు ఉంటుంది. దీంతో కనీసమద్దతు ధర లేకపోవడంతో గిరిజనులు లబోదిబోమంటున్నారు. బయట మార్కెట్లో మాత్రం కిలో చింతపండు 50రూపాయల పైబడే ఉంటుంది. జిసిసి మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన ధర కిలో చింతపండు రూ.34 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే గిరిజనులు సీతంపేట, కుసిమి, మర్రిపాడు, పూతికవలస సంతలకు తెచ్చి చింతపండు విక్రయిస్తున్నారు.
