మత్స్య సంపద యూనిట్లు సజావుగా నెలకొల్పుటకు తగిన చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్

Mar 11,2025 18:09 #krishna

ప్రజాశక్తి – కలక్టరేట్ (కృష్ణా) : జిల్లాలో మత్స్య సంపద యూనిట్లు సజావుగా నెలకొల్పుటకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ .. కలెక్టరేట్లోని వారి చాంబర్లో మత్స్య సంపద యూనిట్లు నెలకొల్పుటకు జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2020-21 సంవత్సరంలో మొదలై 2023-24 సంవత్సరంతో ముగుస్తోందన్నారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 2.60 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. జిల్లాలో పడవలు, వలలు, చేపల కియోస్కుల నిర్మాణం, ఐస్ పెట్టెల మూడు చక్రాల వాహనాలు, చేపల పట్టు పరికరాలు, రిటైల్ మార్కెట్లు తదితర 812 పశుసంపద యూనిట్లు మంజూరు చేసిందన్నారు. అందులో ఇదివరకే 210 యూనిట్లు ప్రారంభించడం జరిగిందన్నారు. మిగిలిన యూనిట్లను గుర్తించిన లబ్ధిదారులకు మంజూరు చేస్తూ ఆమోదం తెలిపామన్నారు. లబ్ధిదారులు యూనిట్లను తప్పనిసరిగా నెలకొల్పేందుకు అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. లబ్ధిదారులు తమ వాటా చందాను చెల్లించేలా చొరవ చూపాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సిహెచ్ నాగబాబు, డిటి డబ్ల్యుఓ ధూర్జటి ఫణి, డి ఆర్ డి ఏ పి డి హరిహర నాథ్, జెడ్పిసిఈఓ కన్నమ నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్, ఎల్ డి ఎం రవీంద్రారెడ్డి, మత్స్యశాఖ ఏడీలు రమేషు, ప్రసాదు, ప్రతిభ పలువురు ఎఫ్ డి ఓ లు పాల్గొన్నారు.

➡️