ఆరోగ్యశ్రీ కొనసాగేలా ఎలక్షన్‌ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలి : జగ్గంపేట టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి

ప్రజాశక్తి-జగ్గంపేట (కాకినాడ) : రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీని కొనసాగించే విధంగా ఎలక్షన్‌ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని జగ్గంపేట టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కోరారు. మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయం వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ … ప్రభుత్వం రూ.1500 కోట్లు ప్రైవేట్‌ ఆసుపత్రులకు బకాయిలు పడి ఉందనే వార్తలు వస్తున్నాయని, రేపటినుండి ఆరోగ్యశ్రీ ను ప్రైవేట్‌ ఆస్పత్రులు నిలిపివేస్తామంటున్నాయని అన్నారు. ఎన్నికల కమిషనర్‌ ఆరోగ్యశ్రీని కొనసాగించే విధంగా ప్రభుత్వపరంగా పేమెంట్‌ ఇచ్చి ఆదేశాలు ఇవ్వాలని ఎలక్షన్‌ కమిషనర్‌ ని కోరారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక మూడు వాయిదాలలో బకాయిలు చెల్లిస్తామని, పార్టీ తరఫున హామీ ఇస్తున్నామని తెలిపారు. ఆరోగ్య శ్రీ ను ప్రైవేట్‌ ఆసుపత్రి యాజమాన్యాలు కొనసాగించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ వి ఎస్‌ అప్పలరాజు , కొత్త కొండబాబు, పాలిశెట్టి సతీష్‌, తదితరులు ఉన్నారు.

➡️