మన్యంలో ఆగని డోలీ మోతలు

Oct 1,2024 21:57

ప్రజాశక్తి – కొమరాడ  : మన్యం జిల్లాలో డోలీమోతలు యథాతథంగానే కొనసాగుతున్నాయి. గ్రామాలకు రోడ్డు సౌకర్యాల్లేకపోవడంతో ప్రజలు అనారోగ్యం బారినపడిన రోగులను డోలీలపై ఆసుపత్రులకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సంఘటనే మండలంలోని చినఖేర్జల పంచాయతీ సీసాడవలసలో చోటు చేసుకుంది. సీసాడవలసకు చెందిన కొండగొర్రె నికితకు పురిటి నొప్పులు రావడంతో వెంటనే ఆ గ్రామంలో ఉన్న ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు అగ్గమ్మ, వరలక్ష్మమ్మ స్పందించి 108కి ఫోన్‌ చేశారు. అయితే గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో చినఖేర్జల జంక్షన్‌ వరకు మంచపై ఆమె బంధులు మోసుకుంటూ తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి పార్వతీపురం జిల్లా కేంద్ర హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో వెంటనే వైద్య సిబ్బంది స్పందించి కాన్పు అయ్యేదాకా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. రోడ్డు సదుపాయం లేకపోవడం దారుణం : సిపిఎందీర్ఘకాలంగా ఉన్న రోడ్డు సమస్యలను నేటికీ పరిష్కరించకపోవడం దారుణమని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి విమర్శించారు. కేవలం 350 మీటర్ల దూరానికి రోడ్డు వేయడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందని ఐటిడిఎ అధికారులను పాలకులు ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించాలని కోరారు.

➡️