ఆక్రమణల తొలగింపునకు అధికారుల సన్నద్ధం

ప్రజాశక్తి-తర్లుపాడు : తర్లుపాడులోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఆక్రమణలు అధికమయ్యాయి. రహదారి ఆక్రమించి కొందరు వ్యాపారస్తులు, ప్రజలు నివాసాలు ఏర్పరచుకోవడంతో రథం బజార్‌, మెయిన్‌ బజార్‌ రహదారులు కుచించుకుపోయాయి. ఆక్రమణలు తొలగించి ప్రయాణికులకు ట్రాఫిక్‌ కష్టాలు, రథోత్సవం సమయంలో భక్తులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు మండల అధికారులు చర్యలు చేపట్టారు. మండల కేంద్రమైన తర్లుపాడులోని బస్టాండ్‌ సెంటర్‌ మొదలుకొని రథం బజార్‌, మెయిన్‌ బజార్‌లలో ఆక్రమణలు పెరిగిపోయాయి. స్థానికంగా సొంత ఇళ్లలో వ్యాపారం సాగిస్తున్న వారంతా, తమ దుకాణాలను ముందుకు జరుపుకొని నివాసాలు నిర్మించుకున్నారు. కొందరు వాటిలో వ్యాపారాలు సాగిస్తుండగా, మరికొందరు అధిక మొత్తంలో అద్దెకిస్తున్నారు. కొబ్బరి బోండాలు, పండ్లు, కూరగాయలు, తిను బండారాలు, వస్త్ర విక్రయదారులు, జనరల్‌ అండ్‌ ఫ్యాన్సీ స్టోర్‌, పచారీ దుకాణాలు ఇలా పలు రకాల వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో ఇరువైపులా ఉన్న దుకాణాలు, నిర్మించిన అరుగులు, దిమ్మెల వల్ల నిత్యం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గతంలో ఈ రహదారులలో రెండు బస్సులు అవలీలగా రాకపోకలు సాగించేవి. ప్రస్తుతం ఇదే దారిలో ఒక బస్సు కూడా ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే దారి గుండా నిత్యం గ్రామంలో, పల్లెలలోని విద్యార్థులను తీసుకు వెళ్లేందుకు స్కూల్‌ బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లు ప్రయాణిస్తుంటాయి. ప్రస్తుతం ఆక్రమణలు అధికమై రహదారులు కుచించుకు పోవడంతో వాహనదారులు, విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.రథోత్సవానికి అడ్డుగా ఆక్రమణలు తర్లుపాడులో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మౌత్సవాలు ప్రతి ఏటా తొమ్మిది రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ బ్రహ్మౌత్సవాల్లో భాగంగా ఏడో రోజు రథోత్సవం నాడు గ్రామ పురవీధుల్లో 60 అడుగుల భారీ రథంతో గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులు దూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో వస్తారు. రహదారికి ఇరువైపులా ఆక్రమణలు అధికమై, రోడ్లు కుచించుకుపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు, ప్రమాదాలకు గురవుతున్నారు. మెయిన్‌ రోడ్‌లో రథం వచ్చి సమయంలో రోడ్డు పల్లంగా, ఏటవాలుగా ఉండటంతో అతివేగంగా ప్రయాణిస్తోంది. ఈ సమయంలో వాటికి చెక్క దిమ్మెలను అడ్డువేస్తూ 60 అడుగుల భారీ రథాన్ని కొందరు అదుపు చేస్తారు. రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు పెరిగి, మూసుకుపోవడం వలన రథాన్ని అదుపు చేయలేకపోతున్నారు. గతంలో కూడా రథాన్ని అదుపు చేసే వ్యక్తి, రోడ్డుకు అడ్డుగా కట్టిన దిమ్మె కారణంగా అదుపుతప్పి, రథం కిందకు జరగడంతో అక్కడే ఉన్న కొందరు తక్షణమే బయటకు లాగి ప్రమాదం జరగకుండా కాపాడారు. కానీ రథం మాత్రం ఒక ఇంటి వైపు దూసుకు వెళ్లింది. కొంచెంలో పెను ప్రమాదమే తప్పింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఆలయ ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కరరావు, గ్రామపెద్దలు మండల అభివృద్ధి అధికారులకు లిఖితపూర్వకంగా అర్జీ ఇచ్చారు. దీంతో మండల విస్తరణ అధికారి సుకుమార్‌, పంచాయతీ కార్యదర్శి కాలంగి శ్రీనివాసులు గ్రామపెద్దలు, ప్రజలతో సంప్రదించి, వారందరి సమ్మతితో ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఆ రహదారులలో మార్కు చేసి, వారందరికీ నోటీసులు అందజేశారు. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం మూడు రోజుల్లోగా ఆక్రమణదారులు స్వతహాగా తొలగించుకోవాలని, లేనియెడల జెసిబిలతో తొలగిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విస్తరణ అధికారి సుకుమార్‌, పంచాయతీ కార్యదర్శి కాలంగి శ్రీనివాసులు, గ్రామపెద్దలు సూరెడ్డి రామసుబ్బారెడ్డి, ఈర్ల వెంకటయ్య, కోలగట్ల భాస్కర్‌రెడ్డి, కాలంగి శ్రీనివాసులు, గోసు వెంకటేశ్వర్లు, గౌతకట్ల సుబ్బయ్య, పల్లెపోగు ప్రభాకర్‌, కోలగట్ల గంగాధరరెడ్డి, వాడేల ప్రకాష్‌రావు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

➡️