మతోన్మాదులు, కార్పొరేట్‌ సంస్థలనుదేశం నుంచి తరిమికొట్టాలి

ప్రజాశక్తి -మద్దిపాడు: క్విట్‌ ఇండియా స్ఫూర్తితో మతోన్మాదులు, కార్పొరేట్‌ సంస్థలను దేశం నుంచి తరిమికొట్టాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు తెలిపారు. కిసాన్‌ సంయుక్త మోర్చా పిలుపులో భాగంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాలం సుబ్బారావు మాట్లాడుతూ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలన్నారు. వ్యవసాయానికి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ప్రభుత్వాలు వ్యవసాయానికి బడ్జెట్‌లో ఇచ్చే సబ్సిడీలు తగ్గించిందని దీని వల్ల రైతులపై అదనపు భారాలు పెరుగుతున్నాయన్నారు. వ్యవసాయ రంగంలో బహుళ జాతి కంపెనీలను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం స్వాగతం పలుకుతుందని మండిపడ్డారు. అనంతరం తహశీల్దారు సుజన్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు కనపర్తి సుబ్బారావు, వెంకటరామిరెడ్డి, సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌కె. కాసిం, ఉబ్బా ఆదిలక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఉబ్బా వెంకటేశ్వర్లు, కాపు సుబ్బారావు, చిన్న, అప్పల హనుమంతరావు, చలంచర్ల కష్ణారెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నాగులుప్పలపాడు : కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోకి ఆహానిస్తున్న కార్పోరేట్‌ కంపెనీలను తరిమి కొట్టాలని కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌కె. మాబు తెలిపారు. నాగులుప్పలపాడులోని బస్టాండ్‌ సెంటర్‌లో క్విట్‌ ఇండియా స్ఫూర్తితో రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాబు మాట్లాడుతూ బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా 1942 ఆగఘ్ట 9న క్విట్‌ ఇండియా ఉద్యమ పలితంగా సాధించుకున్న హక్కులను నీరుగార్చే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవలంబిస్తూ కార్పోరేట్‌ కంపెనీలకు ఆహ్వానం పలుకడం దుర్మార్గమైన చర్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్లకు రూ. 14 లక్షల ఏబై వేల కోట్లు రాయితీలు కల్పిచిందన్నారు. దేశంలో పేదలకు రైతులకు ఇచ్చే సబ్సిడీలు ఎత్తివేయడంతో పాటు ఎలాంటి రాయితీలు కల్పించలేదని విమర్శించారు. కార్పోరేట్‌కు అనుకూలంగా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా మూడు చట్టాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుసంఘాల ఆధ్వర్యంలో సంవత్సరం పాటు చేపట్టిన ఉద్యమ ఫలితంగా ప్రధాని మోడీ దిగివచ్చి రైతులకు క్షమాపణ చెప్పి చట్టాలను వెనక్కి తీసుకున్నారన్నారు. మన రాష్ట్రంలో టిడిపి,జనసేన, వైసిపి మద్దతు తెలపడంతో మూడో సారి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. కార్మికులు పోరాడి సాధించికున్న హక్కులను కాలరాస్తూ పనిభారాన్ని పెంచడానికి బిజెపి ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. తాత్కాలికంగా అప్పట్లో వెనక్కి తీసుకున్న వ్యవసాయ చట్టాలను తిరిగి వేగంగా అమలు చేయడానికి పూనుకుందన్నారు.నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జయంతిబాబు , కౌలురైతు సంఘం జిల్లా సహయ కార్యదర్శి టి.శ్రీకాంత్‌, సిఐటియు మండల కార్యదర్శి జి.బసవపున్నయ్య, చుండూరి శ్రీరామూర్తి, ఎన్‌. రామారావు, స్వర్ణ కిట్టమ్మ, దాసరి ఆంజనేయులు, పాలపర్తి యోనా తదితరులు పాల్గొన్నారు. కొండపి : బడా కార్పొరేట్‌ కంపెనీలను బహిష్కరించి, వారి దోపిడీని అరికట్టాలని రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పరిటాల కోటేశ్వరరావు కోరారు. క్విట్‌ ఇండియాను పురస్కరించుకొని రైతు, రైతు కూలీ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, ఎఐటియుసి ఆధ్వర్యంలో కొండపి బస్టాండ్‌ సెంటర్‌లో నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పరిటాల కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బడా కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలపై రుణాలు మంజూరు చేస్తుందని విమర్శించారు. వ్యవసాయ రంగంలో రైతులకు అనుకూలమైన రుణ విమోచన చట్టం,విత్తన చట్టం, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రావులపల్లి లక్ష్మి మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులను 10 రెట్లు ఎక్కువగా అమ్ముతున్న బడా కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలు, రుణాలుగా ప్రజాధనాన్ని ఉదార స్వభావంతో అందిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు దేపూరి బ్రహ్మయ్య, మాల కొండయ్య, కొమ్ము రోశయ్య రైతు కూలీ సంఘం నాయకులు పరిటాల రాధాకష్ణ, వెన్నపూసల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️