ప్రజాశక్తి – సీతంపేట : ఆరుగాలం శ్రమించి పంటచేతికొచ్చే సమయంలో చేయి జారిపోవడంతో జీడి రైతులు లబోదిబోమంటున్నారు. గిరిజనుల అటవీ ఉత్పత్తుల్లో ప్రధానమైన ఆర్థిక వనరు జీడి. అలాంటి పంట మరో రెండు వారాల్లో ఇంటికి వచ్చే సమయంలో అగ్గి తెగులు సోకి జీడి రైతుల ఆశలను నిరాశ చేసింది. సీతంపేట ఏజెన్సీలో గిరిజనులు జీడి పంటపై ఎక్కువగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏజెన్సీలో 17,839 ఎకరాల్లో 13,357 మంది రైతులు జీడిని సాగు చేస్తున్నారు. జీడి రైతులకు ఎకరాకు 25 వేల వరకు ఏడాదికి ఖర్చు అవుతుంది. కొమ్మ కటింగు, డొంకలు కొట్టడం చుట్టూ శుభ్రం చేయడం, ఎరువు వేసి వేపుగా పెంచడం వంటివి సస్య రక్షణ చేశారు. గురండి, ఈతమానగూడ, పుట్టిగాం, నెల్లిగండి, డుమ్మంగివలస, కోమటిగూడ, బంజారు గూడ పరిసర గ్రామాల్లో జీడి పంటకు అగ్గి తెగులు సోకడంతో పంట పూర్తిగా మాడి మసైపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పూతికవలస, పివి ఈతమానగూడ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో జీడికి అగ్గి తెగులు సోకి సుమారు 200 ఎకరాల వరకు నష్టం జరుగుతుందని రైతులు వాపోయారు. జీడి పంటకు అగ్గి తెగులు సోకినప్పుడు ఆకులు రాలిపోవడం, పువ్వు కాలిపోయిమాడి మసైపోతుంది. కొన్నిచోట్ల అవసరమైతే చెట్టు రాను రాను ఎండిపోయి చనిపోతుంది. దీంతో రైతులు కుదేళవుతారు. ప్రకతి వైపరీత్యం వల్ల నష్టపోయిన జీడి రైతులకు పరిహారం చెల్లించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తీవ్రంగా నష్టపోయా…
నాకున్న ఎకరా 50 సెంట్లు జీడి తోటకు అగ్గి తెగులు సోకడంతో తీవ్రంగా నష్టపోయాను. ఇప్పటికే రూ.40 వేల వరకు ఖర్చు అయింది. ఈ సమయంలో అగ్గి తెగులు రావడంతో కుదేలు అయిపోయాను. ఏప్రిల్‌లో పంట చేతికొస్తుందన్న ఆశను అగ్గి తెగులు నిరాశ చేసింది.
పత్తిక వీరన్న, సర్పంచ్ , పివి ఈతమానుగూడ పంచాయతీ-
అధికారుల దృష్టికి తీసుకెళ్తాం
జీడి పంటకు అగ్గి తెగుళ్లు వంటివి వచ్చిన రైతులు వినతులు ఇస్తే ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్తాం. వారి సూచనలు మేరకు చర్యలు తీసుకుంటాం. అలాగే జీడి రైతులు ఎకరాకు రూ.1600 బీమా చెల్లిస్తే ప్రకృతి వైపరీత్యాలు, ఈదురు గాలులు, గాలి వానలు, అగ్గి తెగుళ్లు వంటి అధిక ఉష్ణోగ్రతలు దాటి ఉన్నప్పుడు బీమా చెల్లించిన రైతులకు పరిహారం వర్తిస్తుంది.
పి.జయ శ్రీహార్టికల్చర్ అధికారి, సీతంపేట
జీడి రైతుకు నష్టపరిహారం చెల్లించాలి
అగ్గి తెగులు, తేనెమంచు, ఈదురు గాలులు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన జీడి రైతులకు సర్వే చేపట్టి పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలి .
ఆరిక భాస్కరరావు,సిపిఎం మండల కార్యదర్శి, సీతంపేట.