ప్రజాశక్తి – పిఠాపురం(కాకినాడ జిల్లా) : ఏలేరు వరద ముంపు కారణంగా పంట నష్టపోయినా పరిహారం అందించలేదని, తనకు న్యాయం చేయాలని కోరుతూ చేస్తూ చింత చెట్టెక్కి కౌలు రైతు నిరసన తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గోకివాడకు చెందిన ఎన్.సూరిబాబు ఈ ఏడాది తొమ్మిది ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వివిధ పంటలు సాగు చేశారు. ఎకరాకు రూ.30 వేల చొప్పున రూ.2.70 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. మరో రూ.1.80 లక్షలు కౌలు చెల్లించారు. గత నెలలో ఏలేరు వరద నీటితో పంట మొత్తం ముంపునకు గురైంది. పరిహారం అందకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కౌలురైతు ఏలేరు కాలువ గట్టు పైనున్న చింత చెట్టు ఎక్కి నిరసన తెలిపారు. ఎఒ అచ్యుతరావు, విఆర్‌ఒ నరసింహమూర్తి హామీతో కౌలు రైతును పోలీసులు కిందకి దించారు.
పరిహారం కోసం చెట్టెక్కిన కౌలురైతు.. న్యాయం చేయాలని డిమాండ్
