తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : రైతు సంఘం

Dec 5,2024 16:24 #Anantapur

ప్రజాశక్తి- పెనుకొండ : తుఫాను వలన నష్టపోయిన వరి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం శ్రీ సత్య సాయి జిల్లా ఉపాధ్యక్షులు హరి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మండలం పరిధిలోని ఎర్రమంచి రాంపురం కురుబవాండ్లపల్లి గ్రామాల వరి రైతుల పొలాలను కల్లాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా వచ్చిన తుఫాన్ వలన హరిపురం, కురుబ వాండ్లపల్లి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వరి కోసి కళ్ళల్లో ఆరాపొసే సమయానికి తుఫాను వల్ల ఒడ్లు తడిసి మొలకెత్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరా వారిసాగుకు రూ. 35 వేల నుంచి రూ. 40వేల పెట్టుబడి పెట్టారని ఒడ్లు కప్పడానికి, ప్లాస్టిక్ పట్టలకు వేల రూపాయలు ఖర్చు చేశారని వాపోయారు. అనంతరం రైతులకు జరిగిన నష్టాన్ని వ్యవసాయ అధికారిని కె.చందనకు వివరించారు. తక్షణం అధికారులు, ప్రభుత్వం స్పందించి గ్రామాలవారీగా సర్వే నిర్వహించాలని చెప్పారు. జిల్లా వ్యాపితంగా తుఫాన్ వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏపి రైతు సంఘం డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకమిటి సభ్యులు ఫకృద్దీన్, రైతులు నరేష్, లక్ష్మణ, చంద్ర, రాజా, ఆంజనేయులు, రఘురామ్, విరజిన్నప్ప, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

➡️