కట్టుదిట్టమైన భద్రత మధ్య అభ్యర్థుల భవితవ్యం

May 16,2024 23:49

స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రత పరిశీలనలో కలెక్టర్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 13న ముగిసిన అనంతరం ఈవిఎంలను స్ట్రాంగ్‌ రూములకు తరలించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అభ్యర్థుల భవిష్యత్‌ నిక్షిప్తమై జూన్‌ 4న వెలువడనుంది. జిల్లాలో ఈ సారి 85.69 శాతం పోలింగ్‌ నమోదవగా ఆయా ఈవీఎంలను భద్రపరిచే ప్రక్రియ సోమవారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకూ కొనసాగింది. మరోవైపు అభ్యర్థులు తమ గెలుపుపై ఎవరికివారే ధీమాగా ఉన్నారు. పోటీ ప్రధానంగా వైసిపి, టిడిపి మధ్య ఉండడంతో తాము చేసిన ప్రచారం, వచ్చిన మద్దతు, ఇచ్చిన హామీల ఆధారంగా ఎవరికి వారే ఓట్ల లెక్కలేసుకుంటున్నారు.
పల్నాడు జిల్లాలో 17,34,858 మంది ఓటర్లుండగా వీరిలో 888159 మంది మహిళలు ఓటర్లున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో మహిళా ఓటర్లు పురుష ఓటర్లు కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 14,86,594 మంది జిల్లా వాసులు తమ ఓటు హక్కు వినియోగించుకోగా వీరిలో 7,58,988 మంది మహిళా ఓటర్లున్నారు. మహిళలు అధిక శాతం ఓటు వినియోగించుకోవడం పట్ల వైసిపిలో గెలుపుపై ఆశలున్నాయి. తమ పాలనలో అన్ని పథకాలు మహిళలకే అందజేశామని, మహిళలు వైసిపిని ఆదరిస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార వర్గాలు నిరుద్యోగ యువత, రైతులతో పాటు సూపర్‌ సిక్స్‌ పథకాలతో మినిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రాధాన్యమిచ్చామని, మహిళలు తమవైపు ఉన్నారని ఎన్‌డిఎ కూటమి నాయకులు చెబుతున్నారు. విభజన హామీలు, రాజధాని నిర్మాణం, ప్రాజెక్టులు ఉపాధిహామీ బలోపేతం, విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు పరిశ్రమ స్థాపన వంటి అంశాలపై తాము ప్రచారం చేశామని, బిజెపి, టిడిపి, వైసిపిల వైఫల్యాలను ఎండగట్టామని, కూలీలు, కార్మికుల ఓట్లు తమకూ వస్తాయని ఇండియా వేదిక అభ్యర్థులు ఆశాభావంతో ఉన్నారు.
పోలింగ్‌ సరళీ పై అంచనా వేస్తూ గెలుపోటములపై అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తునా లోలోపల ఆందోళనగానే ఉన్నారు. ఎన్నికల ముందు ఎవరికి వారే ప్రైవేటు సర్వేలు జరిపించిన అభ్యర్థులు, ఎన్నికల తరువాత కూడా పోలింగ్‌ సరళిపై అంచనాలు రూపొందిస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో వార్డుల వారీగా ఇన్‌ఛార్జులతో సమావేశమై సమీక్షిస్తున్నారు. తాము అనుకున్న ప్రకారం ఓట్లు పడ్డాయో లేదోననే ఆందోళన వారిలో నెలకొంది.
ఫలితాలపై పందేల జోరు
ప్రజాశక్తి-ఈపూరు :
సార్వత్రిక ఎన్నికలు ముగియటంతో ఇరు పార్టీల ఫలితాలపై ఈపూరు మండలంలో పందాల జోరు ఊపందుకుంది. రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర వ్యాపారులు, ఆయా రాజకీయ పార్టీల కార్యకర్తలు జోరుగా పందాలు కాస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో మొదలుకొని వారి సొంత నియోజకవర్గాల్లో ఎవరు ఎంత మెజార్టీతో గెలుస్తారని బెట్టింగులకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై పుట్టుకొస్తున్న పలు సర్వేలు వీరిని మరింత ప్రేరేపిస్తున్నాయి. ఓట్ల లెక్కింపు తేదీకి పందాలు కాసేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే క్రికెట్‌ బెట్టింగులు గ్రామాలకు విస్తరించాయి. ఎక్కువగా యువత బెట్టింగులను వ్యసనం చేసుకొని జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సందర్భంగా ఎవరికివారు తమ పార్టీ విజయం సాధిస్తుందని ఫలితాలపై రూ.లక్షల్లో పందాలు కాస్తున్నారు. కొంతమంది అత్యుత్సాహంగా తమ పార్టీ గెలుస్తుందనే ధీమాతో రూ.లక్షకు రెండు లక్షలు చెల్లిస్తామని పందేలు కాస్తున్నారు.

➡️