తొలి రోజు మందకొడిగా..

Apr 19,2024 00:35

నరసరావుపేట ఎంపీ స్థానానికి ఎన్‌డిఎ కూటమి తరుపున నామినేషన్‌ దాఖలు చేస్తున్న టిడిపి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు
ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి/పల్నాడుజిల్లా :
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభ మైంది. తొలిరోజు నామినేషన్ల దాఖలు మందగనంగా సాగింది. నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని పలు అసెంబ్లీ నియోజక వర్గాలకు, లోక్‌సభకు మొత్తం 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో టిడిపి పార్లమెంట్‌ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్లు వేశారు. నర్సరావుపేట అసెంబ్లీ నంచి టిడిపి అభ్యర్థిగా డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు మాత్రమే నామినేషన్లు వేశారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో మొత్తం 19 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం నుంచి నామినేషన్లు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. మంగళగిరిలో 10 మంది అభ్యర్థులు 14 నామినేషన్లు దాఖలు చేశారు. గుంటూరు పార్లమెంటు నుంచి పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి అంబటి చలమయ్య, స్వతంత్ర అభ్యర్థులుగా డి.రత్నం, ఎ.గాయత్రి, ఎ.శ్రీకృష్ణ, షేక్‌ అస్లాం అక్తర్‌ నామినేసన్‌ దాఖలు చేశారు. మంగళగిరిలో టిడిపి అభ్యర్థి నారా లోకేష్‌ తరుఫున జనసేన, టిడిపి నాయకులు నామినేషన్‌ పత్రాలు అందచేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట అసెంబ్లీకి టిడిపి అభ్యర్థి డాక్టర్‌ చదలవాడ అరవింద్‌ బాబు నామినేషన్లు దాఖలు చేశారు. మాచర్ల నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి తరుఫున కూటమి నాయకులు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. జాతీయ జనసేన పార్టీ తరఫున నరసరావుపేట, సత్తెనపల్లి అసెంబ్లీ అభ్యర్థులుగా దళిత సంఘాల నేతలు డాక్టర్‌ గోదా రమేష్‌ కుమార్‌ నరసరావుపేటలో, గోదా వెంకటరమణ సత్తెనపల్లిలో నామినేషన్‌ దాఖలు చేశారు. నవతరం పార్టీ తరఫున చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థిగా రావు సుబ్రహ్మణ్యం, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థులుగా గడ్డం రమణ (వినుకొండ) జంగా మల్లికార్జునరావు (పెదకూరపాడు), రంగశెట్టి నాగేశ్వరరావు (సత్తెనపల్లి), ఎర్రమోతు మొద్దు ప్రసాదరావు (గురజాల), పెదకూరపాడు గురజాల స్వతంత్ర అభ్యర్థులుగా గౌడు కట్ల అంకమ్మరావు కనకం శ్రీనివాస రావు దాఖలు చేశారు. తాడికొండ నుంచి పిరమిడ్‌ పార్టీనుంచి తాళ్లూరి నాగరాజు, మంగళగిరి నుంచి నవతరం పార్టీ నుంచి రావు సుబ్రహ్మణ్యం, నవరంగ్‌ పార్టీ తరుఫున షేక్‌ జలీల్‌, ఇండిపెండెండెంట్‌గా దానబో యిన వెంకట శివాజి, బిక్షయ్య బండ్ల, నైనాల లావణ్య, జంజనం పద్మ, జైభీమ్‌ పార్టీ నుంచి జడిశావణ్‌కుమార్‌, తెలుగు రాజ్యాధికార సమితి నుంచి జంజనం కోటేశ్వ రరావు, భారత్‌ చైతన్య యువజన పార్టీ నుంచి రామచంద్ర బోడే నామినేషన్లు వేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి భారత్‌ చైతన్య యువజన పార్టీ సంకురు స్తోత్రరాణి, గుంటూరు పశ్చిమ నుంచి పిరమిడ్‌పార్టీ అభ్యర్థి కె.సురేష్‌, గుంటూరు తూర్పు నుంచి పిరమిడ్‌ పార్టీనుంచి కాజా వెంకట రాఘవేంద్ర సంజీవరావు నామినేషన్‌ దాఖలు చేశారు. పొన్నూరు, తెనాలి నియోజకవర్గాల నుంచి నామినేషన్లు ఎవ్వరూ వేయలేదు. నేడు రోశయ్య, ఫాతిమా, శ్రావణ్‌ నామినేషన్లుగుంటూరు లోక్‌సభకు వైసిపి అభ్యర్థి కిలారు రోశయ్య, గుంటూరు తూర్పు వైసిపి అభ్యర్థి నూరిఫాతిమా, తాడికొండ టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్‌ తదితరులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

➡️