ప్ర్రభుత్వ లాంఛనాలతో గరిమెళ్ల అంత్యక్రియలు

  • గరిమెళ్ల భౌతికకాయానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్‌

ప్రజాశక్తి- తిరుపతి సిటీ: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ అంత్యక్రియలు ముగిశాయి. మంగళవారం ఉదయం తిరుపతి భవానీనగర్‌లోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర నిర్వహించారు. హరిశ్చంద్ర శ్మశాన వాటికలో సిఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బాలకృష్ణ ప్రసాద్‌ గుండెపోటుతో ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి ఆయన ఇద్దరు కుమారులు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు మంగళవారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బాలకృష్ణ ప్రసాద్‌ కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా అభిమానులు చేరుకున్నారు. ముందుగా గరిమెళ్ల భౌతికకాయానికి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌ నివాళులర్పించి మాట్లాడారు. గరిమెళ్ల తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కాకుండా యావత్‌ భారతదేశానికి అందించిన విశేష సేవ స్ఫూర్తిదాయకమని అన్నారు. అన్నమయ్య సంకీర్తనకు స్వరకల్పన చేసిన ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. అన్నమయ్య కీర్తనలు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి గరిమెళ్ల చేసిన కృషి దేశానికి ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు మెంబర్‌ పనబాక లక్ష్మి, తిరుపతి ఆర్‌డిఒ రామ్మోహన్‌, చీఫ్‌ పిఆర్‌ఒ డాక్టర్‌ తలారి రవి, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి రామ్‌ రఘునాథ్‌, అన్నమాచార్య ప్రాజెక్టు సిబ్బంది కళాకారులు, ఆస్థాన గాయకులు పాల్గొన్నారు.

➡️