మూడు బిళ్లలాట ముఠా ఆటకట్టు

Oct 8,2024 23:44

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగేశ్వరరావు, సిఐ సుబ్బారాయుడు.. వెనక వరుసలో ముసుగులో నిందితులు
ప్రజాశక్తి-చిలకలూరిపేట :
సాధారణ ప్రయాణికుల్లా ఆటోల్లో వెళుతూ తోటి ప్రయాణికులతో మాటలు కలిపి వారిని మభ్యపెట్టి మూడు బిళ్లల ఆట ఆడించి వారి వద్దున్న డబ్బులు విలువైన వస్తువులను దోచుకునే ముఠాను రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను స్థానిక రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ కె.నాగేశ్వరరావు, సిఐ సుబ్బారాయుడు మంగళవారం వివరించారు. గతనెల 28న బాపట్ల జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి తండాకు చెందిన బాణావత్‌ రాంబాబు నాయక్‌, రామావత్‌ బాబు నాయకతో కలిసి చిలకలూరిపేట గొర్రెల మండీలో తన 16 పొట్టేళ్లను అమ్ముకోగా వచ్చిన రూ.1.15 లక్షలతో సొంతూరుకు వెళ్లేందుకు ఆటోకోసం నిరీక్షిస్తున్నారు. ఇంతలో కొందరు వ్యక్తులు వచ్చి వారిని ఆటోలో ఎక్కించుకొని బయలుదేరారు. మాటలు కలిపి మార్గం మధ్యలో మూడు బిలళ్లలాట ఆడించారు. వారివద్దున్న డబ్బులో రూ.17,500 లాక్కుని బాధితులను రామచంద్రపురం డొంక వద్ద వదిలేసి వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులైన బండారు ఏడుకొండలు, శివరాత్రి నాగేంద్రబాబు, జట్టిపాటి నాగరాజు, శివరాత్రి కొండలు, జెట్టిపాటి శ్రీను ఆటోలో నరసరావుపేట వైపు వెళ్తుండగా మండలంలోని కావూరు బస్టాండ్‌ వద్ద అరెస్టు చేశారు. వారి నుండి రూ.16 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఫిర్యాదు సందర్భంలో బాధితులు తమ వద్ద నుండి రూ.1.15 లక్షలు నిందితులు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని, విచారణలో మాత్రం రూ.17,500 మాత్రమే తీసుకున్నట్లు తేలిందని డీఎస్పీ అన్నారు. ఫిర్యాదుదారులు నిజాయితీతో వ్యవహరించాలని, సొమ్ము వివరాలు కచ్చితంగా మాత్రమే చెప్పాలని కోరారు. తప్పుడు సమాచారం ఇస్తే వారిపైనా చర్యలకు అవంకాశం ఉందని హెచ్చరించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన రూరల్‌ సిఐ బి.సుబ్బారాయడు, ఎస్‌ఐ జి.కుమార్‌, సిబ్బంది శివరామకృష్ణ, రోజ్‌బాబు, దేవరాజు, కె.మధుబాబును డీఎస్పీ అభినందించారు.

➡️