విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
ప్రజాశక్తి -డుంబ్రిగుడ:మండలంలోని కించుమండ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల ప్రహరీ నిర్మాణంతో మూసేసిన ప్రాధమిక పాఠశాలకు వెళ్లే గేటును తెరిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం 516 జాతీయ రహదారిలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక పాఠశాలకు ఒకదానికొకటి ఆనుకుని ఉన్నాయన్నారు. బాలుర ఆశ్రమ పాఠశాలకు ప్రధానగేటు ఉండగా, ప్రాధమిక పాఠశాల చిన్నారులకు ప్రత్యేకంగా మరో గేటు ఉండేదన్నారు. ఇటీవల ఆశ్రమ పాఠశాలకు చుట్టూ ప్రహరీ నిర్మించడంతో, ప్రాధమిక పాఠశాలకు వెళ్లే గేటును తొలగించారన్నారు. దీంతో ప్రాధమిక పాఠశాలకు వెళ్లే . చిన్నారులకు దారి మూసుకుపోవడంతో చుట్టూ తిరిగి జాతీయ రహదారి మీదుగా పాఠశాలకు చేరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా గేటును పున్ణ ప్రారంభించాలని వేడుకుంటున్నా సంబంధిత ఆశ్రమ పాఠశాల యాజమాన్యం స్పందించడం లేదన్నారు. జాతీయరహదారిలో నిత్యం లెక్కలేనన్ని భారీ వాహనాల రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో తమ పిల్లలను ప్రాధమిక పాఠశాలకు పంపేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు. ఇప్పటికైన ఉన్నత స్థాయి అధికారులు స్పందించి, ప్రహరీ నిర్మాణంలో మూసేసిన గేటును పున్ణ ప్రారంభించాలని కోరారు.కాగా ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సంరక్షణకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రహరీని నిర్మించామనిఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గెన్ను తెలిపారు. రెండు పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉండడంతో ప్రధాన గేటు ద్వారా ప్రాధమిక పాఠశాలకు వెళ్లాలని చిన్నారుల తల్లిదండ్రులకు సూచించామన్నారు. విద్యార్థుల భద్రత, రక్షణ దృష్ట్యా, బయట వ్యక్తులు లోపలికి రాకుండా, విద్యార్థులు బయటకు వెళ్లకుండా ఉండేందుకు గేటును మూసేశామని స్పష్టం చేశారు.
జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు