జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఖాదర్‌వలీ
బాలికల సమగ్రాభివృద్ధే లక్ష్యం
– జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఖాదర్‌వలీ
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్ : బాలికలపై కొనసాగుతున్న వివక్షను తొలగించి వారి సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చూడాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఖాదరవల్లి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు పట్టణంలోని ఎపిఆర్‌జిఎస్ ప్రాంగణంలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాదర్ వలీ మాట్లాడుతూ దేశంలో బాలికల సమగ్ర అభివృద్ధికి గర్ల్స్ చైల్డ్ డెవలప్‌మెంట్ మిషన్ పేరుతో కేంద్రం ఓ కార్యక్రమం తెచ్చిందని, బాలికల సంపూర్ణ ఎదుగుదల కోసం రకరకాల సదుపాయాలు కల్పిస్తుందని, వాటిల్లో భాగంగానే ప్రతియేటా జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నారు. సమాజంలో బాలికల సంరక్షణ వాళ్ళ హక్కులు ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాలికల చదువు, పెంపకంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా చేస్తున్నారని తెలిపారు. అక్షరాస్యత కూడా పురుషులలో 80శాతం ఉండగా మహిళలలో 70శాతం మాత్రమే ఉందన్నారు. మూఢనమ్మకాల వల్ల వరకట్నం సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల వల్ల ఆడపిల్లలను కనడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారని తెలిపారు. బాలికలకు తమ హక్కులపై అవగాహన కల్పించడానికి లింగ వివక్షను రూపు మాపడానికి మహిళ సాధికారత కోసం పోరాటం అనేవి బాలికల దినోత్సవం లక్ష్యాలుగా ఉన్నాయని, మరోవైపు బాలికలపై నానాటికి లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని బాలిక సాధికారత వస్తేనే మహిళ సాధికారత వస్తుందన్నారు. అందుకు విద్యే ఏకైక మార్గమని, ఆ మేరకు బాల్యవివాహాలు నియంత్రించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యుపిహెచ్‌సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అస్మా, జిల్లా టివి కంట్రోలర్ శ్రావణ్, ఎంపిహెచ్‌ఇఒ సుధాకర్, ప్రిన్సిపల్ కామేశ్వరీ, ఉపాధ్యాయులు, ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
