ప్రజాశక్తి – కురుపాం : గిరిజన గ్రామాలన్నింటికీ పక్కా రహదారి సౌకర్యం కల్పించి డోలీ మోతల్లేని గ్రామాలుగా చూడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మండలంలోని జి.శివడ నుంచి రాముడుగూడ వరకు రూ.90 లక్షలతో నిర్మించిన రహదారి, రూ.2 కోట్లతో రాముడుగూడ నుంచి కిడవాయి వరకు నిర్మించిన మరో రహదారిని మంత్రి ప్రారంభించారు. ఉపాధిహామీ మెటీరియల్ కాంపోనెంట్ కింద రోడ్లు నిర్మించారు. 72 రోడ్లు వేయడానికి రూ.99 కోట్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. ఈ మండలంలో 195 అనుసంధానం లేని గ్రామాలున్నాయని, దశల వారీగా కనెక్టివిటీ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో హాస్టల్ నిర్వహణ, మౌలిక సదుపాయాల కోసం రూ.156 కోట్లు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. జూన్ 1 నుంచి అమ్మకు వందనం, మే నెలాఖరు నుంచి సుఖీభవ అమలు చేస్తామని మంత్రి చెప్పారు. గిరిజన యువతకు స్వయం ఉపాధి కోసం ట్రైకార్ రుణాలు అందజేస్తామని, బీసీలకు శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 950 అంగన్‌వాడీ పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తామని ఆమె అన్నారు. గిరిజన ప్రాంతాల అభివద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక ఆగదీశ్వరి అన్నారు. అనంతరం గర్భిణీలకు సామూహిక సీమంతాలు జరిపించారు. కార్యక్ర మంలో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, అధికారులు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్, పలువురు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.త్వరలో ఏనుగుల సమస్య పరిష్కరిస్తాం ఏనుగులను ప్రస్తుతం ఉన్న ప్రాంతాల నుంచి త్వరలో తరలిస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. పంటలకు భారీ నష్టం వాటిల్లిందని, ఆటవీశాఖను కూడా చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లామన్నారు. ఏనుగులను తరలించేందుకు కుంకీ ఏనుగులు వస్తాయని ఆమె తెలిపారు అలాగే కురుపాం, పాలకొండ నియోజకవర్గాల అవసరాలకు అను గుణంగా తోటపల్లి కాలువను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, పూర్ణపాడు టాబేసు వంతెన పనులు త్వరలో పూర్తికానున్నాయని ఆమె పేర్కొన్నారు.
