గిరిజన సంక్షేమశాఖా మంత్రి సంధ్యారాణి
ప్రజాశక్తి- మెంటాడ : వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరుశాతం స్థానాల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పట్నుంచే పనిచేయాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గురువారం టిడిపి మండల కార్యకర్తలు, నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇచ్చిన హామీలన్నింటినీ ప్రాధాన్య క్రమంలో దశలవారీగా అమలుచేసి చూపుతామన్నారు. వచ్చే నెలలోనే తల్లికి వందనం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికీ 15 వేలు చొప్పున అందజేస్తామని తెలిపారు. రైతుభరోసాను కూడా విడుదల చేస్తామన్నారు. అన్ని గ్రామాలకు తాగునీరు, రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. చేసిన మంచిని చెప్పుకోకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని హెచ్చరించారు. స్థానికంగా ప్రభుత్వ పథకాల అమలుపై ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రజల స్పందనకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆగూరు గ్రామం నుంచి 15 కుటుంబాలు మంత్రి సమక్షంలో టిడిపిలో చేరాయి. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు చలుమూరి వెంకటరావు, నాయకులు జి.అన్నవరం, రెడ్డి ఆదినారాయణ, ఆర్.రవి శంకర్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.