సిబ్బంది సర్దుబాటుకు ఆదేశాలు జారీ
సగానికి తగ్గనున్న సచివాలయాలు?
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సచివాలయ వ్యవస్థను తగ్గించడమే కూటమి ప్రభుత్వంగా కనిపిస్తోంది. రానున్న కాలంలో ఉన్న సచివాలయాల సంఖ్యను 50 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు కేటగిరిల కింద సచివాలయ వ్యవస్థను మారుస్తూ సిబ్బంది సర్దుబాటుకు ఆదేశాలు ఇవ్వడం అందుకు నిదర్శనంగా ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం మొత్తం సచివాయాలను మూడు కేటగిరిలుగా విభజిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల్లో పనిచేసే వివిధ శాఖల ఉద్యోగులను సర్దుబాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2500 జనాభా ఉన్న సచివాలయాలకు ఇద్దరు, 2501 నుంచి 3500 జనాభా వరకు ఉన్న సచివాలయాలకు ముగ్గురు సిబ్బందిని, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న సచివాలయాలకు నలుగురు సిబ్బందిని కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సచివాయాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసులను ఉంచనున్నారు. మిగతా వారిని శాఖల వారీగా సర్దుబాటు చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో అడ్మిన్ కార్యదర్శితో పాటు నలుగురే ఉంటారని తెలుస్తోంది. వార్డు సచివాలయాల్లో కొత్త నియామాకాలను చేపట్టకుండా ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేయనున్నారు. పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా సచివాలయల సంఖ్యను దాదాపు 30 శాతం వరకు తొలుత తగ్గించనున్నారు. తర్వాత మరో 8 నెలలు కాల వ్యవధిలో ఈ సంఖ్యను 50శాతం చేయాలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. సెక్టార్ పరిధిలోకి రెండు సచివాలయాలు మున్సిపాల్టీలలో దాదాపు 40నుంచి 50శాతం వరకు సచివాలయాలు తగ్గనున్నాయి. ఇప్పటికే కొంతమంది వేరే ఉద్యోగాల్లోను, మరికొంత మంది దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నారు. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో 10 మంది ఉద్యోగులను గత ప్రభుత్వం కొనసాగించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయాల వ్యవస్థపై సమీక్ష చేసి పట్టణాలు, నగర ప్రాంతాల్లో 8 వేల మందికి ఒక సచివాలయం ఉండాలని ప్రతిపాదించింది. మొత్తం ఎ, బి, సి కేటగిరిలో విభజించి ప్రస్తుతం ఉన్న సిబ్బందిని కుదించి మిగతా వారిని శాఖల వారీగా నర్దుబాటు చేయనున్నారు. సర్దుబాటు ద్వారా మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్ గా వీరిని విభజించాలనేది ప్రతిపాదనకు అనుగుణంగా మార్పులు చేయనున్నారు. రెండు సచివాలయాలు ఒక సెక్టార్ కిందకు తీసుకొని రానున్నారు. ప్రస్తుతానికి ఒక సెక్టార్ లో రెండు సచివాలయలు ఉన్నాయి. ఉద్యోగులు పదోన్నతులు, లేదా సర్దు బాటు వలన పోస్టులు తగ్గితే కొన్నాళ్ళు తర్వాత సెక్టార్ లో ఉండే రెండు సచివాలయాలను ఒకటిగా చేసి, రెండింటినీ విలీనం చేయనున్నారు. దీంతో ప్రస్తుతం విజయనగరం నగర పాలక సంస్థలో ఉన్న 61 సచివాలయాలు రానున్న కాలంలో 30 నుంచి 35 సచివాలయాల తగ్గిపోనున్నాయి.