ప్రజాశక్తి – పంగులూరు కొనుగోలు కేంద్రాలు ద్వారా ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్.గంగయ్య డిమాండ్ చేశారు. సిపిఎం మండల కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ పంగులూరు మండలం రామకూరు గ్రామంలో రైతులు సుమారు 400 ఎకరాల్లో మాగాణి సాగు చేశారన్నారు. ప్రస్తుతం ధాన్యం నూర్పిడి జరుగుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. ప్రైవేటు వ్యాపారులు రైతుల అవసరాలను గుర్తించి తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. బస్తా రూ.1400 అడుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం బస్తా రూ.1740 కొనుగోలు చేస్తామని ప్రకటించినట్లు తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడులు, ఖర్చులు పెరిగినట్లు తెలిపారు. ఈ నేథ్యంలో బస్తా రూ. 1740 రూపాయలకు అమ్మితేనే రైతుకు గిట్టుబాటు అవుతుందన్నారు. ప్రైవేట్ వ్యాపారులు రూ.1400కొనుగోలు చేయటం వల్ల రైతులు భారీగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. రామకూరు గ్రామంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని గత 15 రోజులుగా అధికారులు చెబుతున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకూ ఒక గింజ కూడా కొనుగోలు చేయలేదన్నారు. జిల్లాలో కొన్నిచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సి ఉందన్నారు. రైతుల ఇబ్బందులను దష్టిలో ఉంచుకొని తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. రైతులు వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు తలపనేని రామారావు, రాయిని వినోద్ బాబు, మండల కమిటీ సభ్యులు ఎం. హరిబాబు, నాయపాము ప్రభాకర్, పూసపాటి సుబ్బరాజు, పాలపర్తి ఏలియా పాల్గొన్నారు.