ప్రజాశక్తి-పార్వతీపురం : వైద్యారోగ్యశాఖ నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలను ప్రయివేటు ఆస్పత్రులు అమలు చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ఎస్.భాస్కరరావు ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశాన్ని బుధవారం స్థానిక ఎన్‌జిఒ హోం నిర్వహించారు. ఆస్పత్రులలో నిర్వహించిన ప్రతీ ప్రసవానికి సంబంధించిన పూర్తి వివరాలు హెచ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ప్రసవం తర్వాత జనన ధ్రువపత్రాన్ని వారికి అందజేయాలన్నారు. కాన్పుల వివరాల నమోదు రికార్డు.. పార్చురిషన్ రిజిస్టర్ అన్ని ప్రయివేటు ఆస్పత్రుల్లో ఒకే విధంగా ఉండేటట్లు చూసుకోవాలని తెలిపారు. ఎన్ని సాధారణ, సీజేరియన్ డెలివరీలు నిర్వహించారో ఆస్పత్రుల వారీగా రికార్డుల్లో పరిశీలించారు. సీజేరియన్ డెలివరీ నిర్వహణకు తగు కారణాలు ఉండాలని స్పష్టంచేశారు. శస్త్ర చికిత్స సమయంలో అనస్థీషియా వైద్యులు అందుబాటులో తప్పనిసరిగా ఉండాలన్నారు. స్కానింగ్ నిర్వాహకులు పిసి అండ్ పిఎన్‌డిటి యాక్ట్ కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అందుకు సంబంధించి నిర్దేశించిన కొలతలు ఉన్న పోస్టర్‌ను అక్కడ ప్రదర్శించాలన్నారు. ఆరోగ్య పరీక్షల రుసుం వివరాలు ఆస్పత్రిలో ప్రదర్శించాలని సూచించారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. డెంగీ జ్వర తుది నిర్దారణ నిర్దేశించిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు టి.జగన్మోహనరావు, పిఎల్. రఘుకుమార్, ఐఎంఎ ప్రెసిడెంట్ యాళ్ల వివేక్, డిఎస్‌ఒ శంకర్, డెమోలు యోగీశ్వరరెడ్డి, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
