ప్రజాశక్తి – పార్వతీపురం : జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇచ్చిన లక్ష్యాలను నిర్దేశిత సమయంలోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి పలు అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో నెలకు 1,000 గృహాలు పూర్తి చేయాలని లక్ష్యాలను నిర్దేశించామని, ఇందులో కనీసం 500 గృహాలైన పూర్తిచేయాలని స్పష్టం చేశారు. మే నెలాఖరుకు 1600 గృహాలు పూర్తిచేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ప్రతి మండలంలో వారానికి వంద గృహాలు పూర్తయితే గానీ అనుకున్న లక్ష్యాలను సాధించలేరని చెప్పారు. పిఎంఎవై 2.0 కింద లబ్దిదారులకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో తహశీల్దార్లు ఉదాసీనత వహిస్తున్నారని, ఇలా కొనసాగితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. మంగళవారం నాటికి లబ్దిదారులకు అవసరమైన పత్రాలను తహశీల్దార్లు మంజూరుచేయాలని ఆదేశించారు. చెత్త నుంచి సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. అనీమియా యాక్షన్ కమిటీలు నిర్వహించి వాటిలో ప్రత్యేక అధికారులు పాల్గొనాలని తెలిపారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు వయసుకు తగిన బరువు, ఎత్తు, నాణ్యమైన పౌష్టికాహారం, గర్భిణీలకు, బాలింతలకు ఇస్తున్న టిహెచ్‌ఎర్ సక్రమంగా ఇస్తున్నదీ, లేనిదీ వంటి అంశాలను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడా నీరందని గ్రామాలు ఉండరాదని, సమస్య లు రాక మునుపే ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్య తలెత్తకుండా ముందే తగు జాగ్రత్తలు తీసుకోవా లని సూచించారు. స్థానిక ఎంపిడిఒ, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు దీనిపై అప్రమత్తం గా ఉంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో 950 గ్రామాలు హైరిస్క్ గ్రామాలుగా ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారని, ఆయా గ్రామాల్లో దశల వారీగా స్ప్రేయింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మే 1 నుంచి తొలి దశ జియ్యమ్మవలస, కురుపాం, కొమరాడ, పాచిపెంట, సీతంపేట మండలాల్లోని స్ప్రేయింగ్ చేయించాలని సూచించారు. ఆయా తేదీల్లోని గ్రామాల్లో ముందుగా చాటింపు వేయించి, ప్రజలు సహకరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో సబ్ కలెక్టర్లు అశుతోష్ శ్రీవాస్తవ, సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డిఆర్‌ఒ కె.హేమలత, గృహ నిర్మాణ సంస్థ పీడీ పి.ధర్మచంద్రారెడ్ది, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎన్.విజరుస్వరూప్, డిఎల్డిఒలు, తహశీల్దారులు, ఎంపిడిఒలు, హౌసింగ్ డిఇ, ఎఇలు పాల్గొన్నారు.
