అపరిశుభ్రతకు నెలవుగా ఆసుపత్రి

పెదబయలు ప్రాధమిక ఆరోగ్యకేంద్రం

ప్రజాశక్తి- పెదబయలు : పెదబయలులోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రం అపరిశుభ్రత, అసౌకర్యాలకు నెలవుగా ఉందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బోండా సన్నిబాబు విమర్శించారు. ఆసుపత్రికి అనారోగ్యంతో వస్తే, ఉన్న జబ్బు నయం కావడం మాట అటుంచితే, కొత్త రోగాలు వచ్చే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అస్వస్థతకు గురైన తన బిడ్డను వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లిన సన్నిబాబు, అక్కడ నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోపలికి అడుగు పెట్టగానే ముక్కు పుటాలను అదరగొట్టే దుర్గందం ఉందని, గురువారం ఆసుపత్రిని కనీసం శుభ్రపరిచే పరిస్థితులు లేకపోవడం దారుణమన్నారు. స్థానిక వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణ లోపం వల్ల ఆసుపత్రి మొత్తం అపరిశుభ్రత, దుర్వాసనతో నిండి రోగులందరూ నానా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.వార్డులో ఇన్‌పేషెంట్లుగా చేరాలనుకుంటే మరుగుదొడ్ల నుంచి వస్తున్న కంపుతో ఉండలేని స్థితి ఉందన్నారు.24 గంటలూ రోగులకు అందుబాటులో వైద్యసేవలు అందించాల్సిన స్థానిక పిహెచ్‌సిలో ఇద్దరు వైద్యులు సమయపాలన పాటించడం లేదని తెలిసిందన్నారు. సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోగా, మందులుకూడా అందుబాటులో లేవని, దీంతో ఆసుపత్రికి వచ్చిన రోగులకు నామమాత్రపు వైద్యసేవలు అందే పరిస్థితి లేదన్నారు. మారుమూల గ్రామాలన ఉంచి ఎంతో ఆశగా వైద్యసేవలకు వచ్చిన గిరిజన రోగులకు నిరాశే తప్ప, ఇక్కడ కనీసస్థాయి వైద్యం కూడా అందడం లేదన్నారు.దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని, ఆసుపత్రిలో పరిశుభ్రత, వైద్యసేవలు మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని సన్నిబాబు డిమాండ్‌ చేశారు.

పెదబయలులోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రం

➡️