ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : గజపతినగరం ప్రాజెక్టులో అక్రమంగా తొలగించిన అంగన్వాడీ హెల్పర్ మానాపురం సౌజన్యను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఐసిడిఎస్ పిడి, పిఓల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సి ఐ టి యు)ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద రెండో రోజు రిలే నిరాహార దీక్షలను అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి పైడ్రాజు ప్రారంభించారు. గజపతినగరం ప్రాజెక్టు, గజపతినగరం మండలం, రామన్నపేట గ్రామంలో సౌజన్యకు అంగన్వాడీ హెల్పర్ గా 2022 సంవత్సరం అక్టోబర్లో ఉద్యోగం ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి రిమార్క్ లేకుండా పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామన్నపేట గ్రామ సర్పంచ్ అరుణ కుమారి చేసిన రాజకీయ వేధింపులో భాగంగా సౌజన్యని తొలగించాలని ఐసిడిఎస్ పిఓపైన ఒత్తిడి తీసుకొచ్చారు. రాజకీయ వేధింపులు ఆపాలని గజపతి నగరం నియోజవర్గం ఎమ్మెల్యే , సూక్ష్మ – చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాసరావు దృష్టికి అంగన్వాడీ యూనియన్ గా సమస్యను తీసుకెళ్లడం జరిగింది. అయినా తాను తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిందని 30- 11 – 24 శనివారం తొలగించారు. సౌజన్యకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఇప్పుడున్న ఐసిడిఎస్ పిడి శాంత కుమారి, సిడిపిఓ గజపతినగరం ప్రాజెక్ట్ నాగమణి పరిశీలించి ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు సౌజన్య సర్టిఫికెట్లు సక్రమమైనప్పుడు నేడు అక్రమం ఎలా అవుతాయని వారు ప్రశ్నించారు? కావాలని రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఆమెను తొలగించడం జరిగింది. కావున మంత్రి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ స్పందించి సౌజన్యని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పిడి, సిడిపిఓ ల పైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా నిరాహార దీక్షలకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి పి. రమణమ్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేష్ మాట్లాడుతూ అక్రమంగా తొలగించిన సౌజన్యకు న్యాయం చేయాలని, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి మహిళ కాబట్టి తాము జోక్యం చేసుకొని చిరుద్యోగి అయినా సౌజన్యకు న్యాయం చేయాలని అన్నారు. ఆమె రోడ్డు మిద పడితే కనీసం పట్టించుకోకుండా ఉండడం అన్యాయమని వెంటనే పరిష్కారం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు జరిగే ఉద్యమంలో అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్, మానాపురం సౌజన్య, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వి లక్ష్మి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కే సురేష్, జిల్లా కమిటీ సభ్యులు కే ప్రభావతి, సిహెచ్ రమణమ్మ, కే నాగమణి, బి సునీత, ఏ ఉషారాణి, బి కరుణ, ఎల్బీవి లక్ష్మి, వర్కర్లు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
