గీతంలో ముగిసిన అంతర్జాతీయ సదస్సు

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం

ప్రజాశక్తి -మధురవాడ : ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో మారుతున్న రాజకీయ, ఆర్ధిక సమీకరణాలు భద్రతా అంశాలపై గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. గీతం వర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, జవహర్‌లాల్‌ నెహ్రు విశ్వవిద్యాలయం (నూఢిల్లీి), సెంటర్‌ ఫర్‌ ఈస్ట్‌ ఏషియన్‌ స్టడీస్‌, తైవాన్‌కు చెందిన ఎకనామిక్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ సంయుక్త ఆధ్వర్యాన నిర్వహించిన సదస్సులో అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ పరిణామాలు, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో వాటి ప్రభావంపై నిపుణులు చర్చించారు. తైవాన్‌కు చెందిన ఎకనామిక్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ అధికారిక ప్రతినిధి రాబర్ట్‌ హిష్‌ మాట్లాడుతూ తైవాన్‌ చిన్న దేశమైనా, విద్య, ఆరోగ్య, వాణిజ్యరంగాలలో ప్రపంచంలోనే అగ్రస్థానం ఉందన్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో తైవాన్‌ పాత్రను తగ్గించడానికి చైనా ఉద్దేశ్య పూర్వకంగా సమస్యలు సష్ఠిస్తోందన్నారు. ఇతర ప్రపంచ దేశాలతో పాటు భారత్‌తో బలమైన వాణిజ్య సంబంధాలను తైవాన్‌ కొనసాగిస్తోందన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ మాట్లాడుతూ తైవాన్‌తో భారత్‌ సంబంధాలు భవిష్యత్తులో మరింతగా మెరుగు పడతాయన్నారు. గీతం ఆర్ధిక శాస్త్ర విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మందర్‌ వి.కులకర్ణి మాట్లాడుతూ ఆసియా పసిఫిక్‌ దేశాలు ఆర్ధికాభివృద్ధికి వివిధ కూటమిలలో పనిచేస్తున్న భారత్‌ వ్యూహత్మకంగా వ్యవహరిస్తోందన్నారు. నేషనల్‌ మేరీటైం ఫౌండేషన్‌ నిపుణురాలు కె.దీపా బంగాళాఖాతంలో ఆర్ధిక, పర్యావరణ అంశాల మధ్య భారత్‌ సమతుల్యత పాటిస్తూ ఆర్ధిక శక్తిగా ఎదుగుతోందన్నారు. కార్యక్రమంలో సెంటర్‌ ఫర్‌ ఈస్ట్‌ ఏసియన్‌ స్టడీస్‌ చైర్‌పర్సన్‌ ప్రొఫెసర్‌ అల్కా ఆచార్య, గీతం వర్సిటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.సుష్మరాజ్‌, దేశంలోని వివిధ వర్సిటీల నిపుణులు పాల్గొన్నారు.

ముగింపు సభలో అతిథులకు జ్ఞాపికలతో సత్కారం

➡️