సాగునీరు విడుదల చేయాలి

Feb 15,2025 00:11

విలేకర్లతో మాట్లాడుతున్న పాశం రామారావు
ప్రజాశక్తి – పెదనందిపాడు :
మొక్కజొన్న, మిర్చి, మినుము, పెసర పైర్ల తడుపుల నేపథ్యంలో అప్పాపురం ఛానల్‌, ఎన్‌ఎస్‌పి కెనాల్‌ నీటిని విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు డిమాండ్‌ చేశారు. స్థానిక తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో యూరియా కొరత ఉందని, రైతుసేవా కేంద్రాలు, సొసైటీల్లో సత్వరం అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ ప్రాంతంలో ప్రధాన పంట అయిన మిర్చి ధరలు తగ్గటంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. క్వింటాళ్‌ రూ.18 వేలున్న ధర రూ.10 వేలకు పడిపోయిందని చెప్పారు. పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో క్వింటాళ్‌కు రూ.20 వేలు కనీస మద్దతు ధర ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వరికి మద్దతు ధర 75 కిలోల బస్తాకు రూ.1740 ప్రకటించినా నిబంధనల సాకుతో సరిగా కొనుగోలు చేయడంలేదని, 80 శాతం మంది రైతులు రూ.1300కే అమ్ముకుని నష్టపోయారని తెలిపారు. నిబంధనలు సడలించి మద్దతు ధరకు కొనాలని డిమాండ్‌ చేశారు. శనగ పంటలో తెగుళ్లు ఆశించి పెద్ద ఎత్తున దిగుబడి తగ్గిపోయే పరిస్థితులున్నాయని, దీనిపై ప్రభుత్వం అంచనా వేసి బాధిత రైతులకు పరిహారం అందజేయాలని కోరారు. ఈనెల 24న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో ఈ ప్రాంత ప్రధాన సమస్యలైన గుంటూరు ఛానల్‌ పొడిగింపునకు, నల్లమడ వాగు ఆధునీకరణకు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కౌలురైతులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా బ్యాంకు రుణాలు అందటం లేదని, అర్హులైన కౌలు రైతులందరికీ పంట రుణాలిప్పించాలని కోరారు. సాగు నీటి సంఘాలకు నిధులు కేటాయించి కాల్వల మరమ్మతులు చేయాల న్నారు. సమావేశంలో రైతుసంఘం మండల కార్యదర్శి కె.వెంకటశివరావు, నాయకులు పి.సుధీర్‌, ఎన్‌.రాజేంద్ర పాల్గొన్నారు.

➡️