ప్రజాశక్తి-బల్లికువర : కూకట్లపల్లి యానాది కాలనీలో అసైన్డ్ భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దారు రవినాయక్‌కు వినతి పత్రం అందజేశారు. మండల పరిధిలోని కూటకటపల్లిలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా యానాది కాలనీ వాసులు మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా తమ సమస్య వింటున్నారే కానీ పరిష్కరించిన దాఖలాలు లేవని వాపోతున్నారు. తహశీల్దారు కార్యాలయం ఎదుట గతంలో వంటా వార్పులు, ధర్నాలు నిర్వహించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. సిపిఎం నాయకుడు తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యానాది కాలనీ వాసుల సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. అన్యాక్రాంతమైన దళితుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం సిపిఎం కార్యకర్తలు పావులు రమణయ్య, గొల్లపూడి అంజయ్య బాధితులతో కలిసి తహశీల్దారుకు అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దారు మాట్లాడుతూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వేమూరు : మండలపరిధిలోని పోతుమర్రు, పులిచింతల పాలెం గ్రామాల్లో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. పోతుమర్రు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామసభలో రైతుల వద్ద నుంచి తహశీల్దారు సుశీల అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహశీల్దారు సుశీల మాట్లాడుతూ మంగళవారంతో వేమూరు మండలంలో రెవెన్యూ సదస్సులు ముగిసినట్లు తెలిపారు. మొత్తం 197 అర్జీలు రాగా అందులో 106 అర్జీలను పరిష్కరించినటు ఆమె తెలిపారు. రెవెన్యూ సదస్సుల విజయవంతానికి సహకరించిన అధికారులు, రైతులకు తహశీల్దారు కృతజ్ఞతలు తెలిపారు.