ఓటర్ల జాబితా తప్పుల తడక

Feb 15,2025 00:13

వేర్వేరు నంబర్లతో రెండు చోట్ల పేర్లున్న ఓటరు జాబితా
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం టిడిపి కూటమి నేతలు పలు అక్రమాలకు తెరతీశారు. ఓటర్ల జాబితాల్లో పేర్లు చేర్పించే ప్రక్రియలోనే అక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఒక వ్యక్తి పేరుతో రెండు మూడు చోట్ల ఓటరుగా ఉన్నట్టు తాజాగా విడుదల చేసిన జాబితాల్లో డబల్‌ ఎంట్రీలు కన్పిస్తున్నాయి. ఒకే పేరు రెండుమూడు చోట్ల తారసపడుతున్నా ఏ స్థాయి అధికారీ వీటిపై దృష్టి సారించలేదు. ఈ స్థానానికి 2019లో జరిగిన ఎన్నికల్లో కంటే ఈసారి దాదాపు లక్ష మంది ఓటర్లు పెరిగారు. కూటమి నేతల ఆరు నెలల ముందు నుంచే కొత్త ఓటర్ల చేర్పించేందుకు పలు శిబిరాలు ఏర్పాటు చేశారు. లక్ష ఓటర్ల పెరుగుదల ఉన్నా ఒక వ్యక్తిపేరుతో రెండు మూడు చోట్ల పేర్లు ఉండటం చర్చనీయాంశంగా మారింది. సాధారణ ఓటర్ల జాబితాకు ఆధార్‌ లింక్‌ చేయడం ద్వారా డబల్‌ ఎంట్రీలను నివారిస్తామని గతంలో ఎన్నికల కమిషన్‌ ప్రకటించినా ఆచరణలో సాధ్యం కాలేదు. అయితే పట్టభద్రుల ఓటర్ల జాబితాల రెండు జిల్లాల పరిధిలో చాలా తక్కువగా ఉండటం వల్ల పరిశీలన చేయడం అధికారులకు కష్టమైన పని కాదు. అంతేగాక ఆధార్‌ అనుసంధానం చేయడం ద్యారా డబల్‌ ఎంట్రీలను నివారించవచ్చు. పట్టభద్రులకు తప్పని సరిగా డిగ్రీ విద్యార్హత ధ్రువపత్రాలు తీసుకోవడం వల్ల రెండుసార్లు ఒకే పేరు ఓటర్ల జాబితాల్లోకి వచ్చిందనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అంతేగాకుండా ఆధార్‌ అనుసంధానం, ధ్రువపత్రాలకు కూడా అనుసంధానం చేయడం ద్వారా డబల్‌ ఎంట్రీలను నివారించే అవకాశం ఉన్నా ఇప్పటి వరకు అధికారులు ఈ ప్రక్రియను పరిశీలించలేదు. దీంతో యథాతథంగా డబల్‌ ఎంట్రీలు జాబితాల్లోకి వచ్చేశాయి. గురువారం రాత్రి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నాగలక్ష్మీ విడుదల చేసిన జాబితాల ప్రకారం పట్టభద్రుల ఎన్నికల పోలింగ్‌లో 3,47,116 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది.కానీ వీటిల్లో డబల్‌ ఎంట్రీల వల్ల వేలాది మంది పెరిగినట్టు తెలుస్తోంది. ప్రధానంగా టిడిపి సానుభూతిపరులుగా ఉన్న పేర్లు జాబితాల్లో రెండు మూడు సార్లు దర్శనమిస్తున్నాయి. అత్యధికంగా గుంటూరు నగరంలోనే ఇవి ఉన్నాయి. మొత్తం ఆరు రెవెన్యూ జిల్లాల పరిధిలో 33 నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఓటర్లు ఉండగా గుంటూరులోనే అత్యధికంగా 108109 మంది ఓటర్లున్నారు. గుంటూరుకు కంటే అత్యధిక పట్టభద్రులున్న ఎన్‌టిఆర్‌ జిల్లాలో 78063 మంది ఓటర్లుగా నమోదయ్యారు. కృష్ణా జిల్లాలో 63,114 మంది, పల్నాడు జిల్లాలో 57238 మంది, బాపట్ల జిల్లా పరిధిలోని వేమూరు, బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల పరిధిలో 24493, ఏలూరు జిల్లా పరిధిలోని నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల్లో 16,099 మంది ఓటర్లున్నారు. పురుషులే కాకుండా మహిళల పేరుతో కూడా డబల్‌ ఎంట్రీలు దర్శనం ఇస్తున్నాయి. ఓటర్ల జాబితాలను పరిశీలించిన అభ్యర్థులు పలువురు ఈ బాగోతాలు చూసి కంగారు పడిపోతున్నారు. డబల్‌ ఎంట్రీలు దర్శనమిస్తున్నా ఇంత వరకు అధికారులు ఎక్కడా పరిశీలన చేయకుండా గురువారం రాత్రి తుది జాబితాలను విడుదల చేయించేశారు.

➡️