ప్రజాశక్తి – మేదరమెట్ల : పట్టణాలకు పోటీగా గ్రామాలనూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయ డానికి ప్రణాళి కలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మేదరమెట్లలో త్వరలోనే సిసి కెమెరాలను ఏర్పాటు చేసి ప్రజల రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. మేదరమెట్లకు చెందిన 374 గిరిజన కుటుంబాలకు భూ హక్కు పట్టాలు శుక్రవారం అందజేశారు. అనంతరం రూ.40 లక్షలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. రూ.40 లక్షల నిధులతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. మేదరమెట్ల ఎస్‌టి కాలనీలో సింథైడ్ ఫ్యాక్టరీ వారు సిఎస్‌ఆర్ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడంతో పాటు తాగునీటి సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైనట్లు ఆయన విమర్శించారు. వరద నీటి ప్రభావానికి గుండ్లకమ్మ గేట్లు కొట్టుకు పోయినట్లు తెలిపారు. వైసిపి ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోలేదని తెలిపారు. ఇసుక దోపిడీ చేశారని విమర్శిం చారు. గుండ్లకమ్మ గేట్లకు మరమ్మతులు చేయించి అందులో 6 లక్షల చేప పిల్లలు వదులు తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, విద్యుత్, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
