ప్రజాశక్తి-బేస్తవారిపేట : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం బేస్తవారిపేట మండలంలోని చిన్నఓబినేనిపల్లి గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని.. ఇంటింటికీ తిరిగి పింఛన్లను పంపిణీ చేశారు. సామాజిక పింఛన్లు పంపిణీ చేసినందుకు మొదటిసారిగా గిద్దలూరు నియోజకవర్గానికి విచ్చేస్తున్న మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి మండలంలోని పెద్దఓబినేనిపల్లి గ్రామం వద్ద గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వం సామాజిక పెన్షన్లను ఏడాదికి 250 రూపాయలు చొప్పున పెంచితే కూటమి ప్రభుత్వం ఒకేసారి రూ.వెయ్యి పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి బెల్లంకొండ సాయిబాబు, టిడిపి బేస్తవారిపేట మండల అధ్యక్షుడు ఎస్.మోహన్‌రెడ్డి, డిఆర్‌డిఏ పీడీ రవిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ నాయక్, చింతామణిపల్లి సర్పంచి బోయిన శ్రీనివాసరెడ్డి, బిజెపి నాయకులు పాల్గొన్నారు. వేటపాలెం : మండల పరిధిలోని వేటపాలెం కుందేరు వెళ్లే దారిలోని అక్సా మసీద్ సెంటర్ సెంటర్‌లోని లబ్ధి దారులకు చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఎన్‌టిఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో పెన్షన్ల పంపిణీలో చీరాల, వేటపాలెం మండలాలు ముందజలో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నాసిక వీరభద్రయ్య, ఎంపిడిఒ మెడబలిమి రాజేష్ బాబు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ నక్కల నాగరాజు, పంచాయితీ సెక్రెటరీ మోతుకూరి మోహన్ రంగారావు, టిడిపి మండల అధ్యక్షుడు బొగ్గుల పార్థసారథి ప్రధాన కార్యదర్శి పల్లపోలు శ్రీనివాసరావు, దోగుపర్తి బాలకష్ణ అందే శ్రీనివాసరావు, పి. వెంకట సుబ్బారావు, జాగాబతుని పోతురాజు, జనసేన నాయకులు కొత్త నాగరాజు, షమ్మీ తదితరులు పాల్గొన్నారు
