ప్రజాశక్తి-మార్కాపురం : రాష్ట్రం అంతటా స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మార్కాపురం ఎంపిపి ఎన్నిక కూడా ఈ నెల 27వ తేదీ గురువారం జరగనుంది. అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈపాటికే ఎంపిటిసి సభ్యులందరికీ ఎంపిపి ఎన్నికకు సంబంధించిన నోటీసులు జారీ చేశారు. ఈ ఎన్నికలో పాల్గొనాలని అధికారులకు ఎంటిసిలకు ఆహ్వానం పంపారు. గురువారం జరగనున్న ఎంపిపి ఎన్నికలో బండి లక్ష్మిదేవి ఎన్నిక లాంఛనమేనని, అధికారికంగా ఎంపిపిగా ఎన్నిక కానున్నారని ప్రస్తుత వాతావరణాన్ని బట్టి తెలుస్తోంది. మార్కాపురం మండలంలో మొత్తం 15 ఎంపిటిసి స్థానాలు ఉన్నాయి. వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి. 15 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అన్ని స్థానాల్లో వైసిపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపిటిసిల్లో ఒకరు చనిపోగా మరొకరు రాజీనామా చేశారు. ప్రస్తుతం 13 మంది మాత్రమే కొనసాగుతున్నారు. మార్కాపురం ఎంపిపి పదవి ఓసి మహిళకు రిజర్వ్ చేశా రు. తొలుతగా వైసిపి తరపున ఎంపిపిగా పోరెడ్డి అరుణ చెంచిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఎంపిపి పదవికి పోటీ పెరగడంతో బండి లక్ష్మిదేవికి రెండవ దఫాలో సగం కాలం కొనసాగేలా ఒప్పందం కుదిరింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపిపి పదవీ పంచాయితీలో ముందుగా పీఠాన్ని అధిష్టించిన పోరెడ్డి అరుణ చెంచిరెడ్డి ఒప్పందంలో భాగంగా రాజీనామా చేశారు. అప్పటి వరకు వైస్ ఎంపిపి గా ఉన్న బండి లక్ష్మిదేవికి ఇన్‌చార్జి ఎంపిపిగా అవకాశం దక్కింది. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికారంలోని కూటమి ప్రభుత్వం చాలా వరకు వైసిపి నుంచి గెలుపొందిన వారిని అక్రమ పద్ధతుల్లో తమవైపు తిప్పుకుని స్థానిక సంస్థల్లో అధికారాన్ని చలాయించాలనే ప్రయత్నాల్లో ఉంది. మార్కాపురంలో మాత్రం ఆ ప్రయత్నాలు ఫలించనట్లుంది. ఇక్కడ వైసిపికి చెందిన ఎంపిటిసిలు గట్టిగా నిలబడ్డారు. టిడిపికి ఒక్కరూ ఎంపిటిసిగా లేకపోవడంతో ఆ ప్రయత్నం పెద్దగా జరగలేదు. తాజాగా జరగనున్న ఎంపిపి ఉప ఎన్నికల్లో వైసిపి ఎంపిటిసిలంతా బండి లక్ష్మిదేవిని ఎన్నుకోవాలని ఈ పాటికే మాజీ ఎమ్మెల్యే, వైసిపి మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు సమావేశం నిర్వహించారు. తాజాగా ఎంపిటిసిలందరినీ తాడేపల్లిలోని మాజీ సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మంగళవారం మాట్లాడించారు. ఈ నెల 27న జరిగే ఎంపిపి ఎన్నికల్లో బండి లక్ష్మిదేవికి మద్దతు తెలపాలని జగన్ కోరినట్లు తెలిసింది. ఎంపిపిగా బండి లక్ష్మిదేవి ఎన్నిక లాంఛనమే అని తెలుస్తోంది.
