మున్సిపల్‌ కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాలి

Jun 10,2024 21:48
ఫొటో : మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య

ఫొటో : మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య
మున్సిపల్‌ కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాలి
– సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య డిమాండ్‌
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : చట్టబద్దత లేకుండా ప్రభుత్వ, కలెక్టర్‌ అనుమతులు లేకుండా 27మంది కొత్త కార్మికులను విధులలో తీసుకొనే అధికారం కావలి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రావణ్‌కుమార్‌కు లేదని ఆయనను వెంటనే సస్పెండ్‌ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం పట్టణంలోని జర్నలిస్ట్‌ క్లబ్‌లో సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మున్సిపల్‌ కమిషనర్‌ కొంత ప్రలోభాలకు ఆశపడి, మాజీ ఎంఎల్‌ఎ ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి చెప్పారనో 27మంది కొత్తవారిని మున్సిపల్‌ కార్మికులుగా చేర్చుకొని 10మందికి జీతాలు రాయడం చట్ట విరుద్ధమన్నారు. మున్సిపల్‌ కార్మికులుగా కొత్తవారిని చేర్చుకోవాలంటే మున్సిపల్‌ తీర్మానం ఉండాలన్నారు. అలా లేకపోతే మున్సిపల్‌ కమిషనర్‌, ఆర్‌డిఒ తీర్మానించి జిల్లా ఆప్కాస్‌కు పంపించాలన్నారు. ఆప్కాస్‌లో ఆమెదించి కలెక్టర్‌ పరిశీలించాక రాష్ట్ర ఆప్కాస్‌కు పంపిస్తారన్నారు. ఆ తరువాత అక్కడ ఆమెదించి ప్రభుత్వ అనుమతి తీసుకుంటారన్నారు. ఇదేమి లేకుండా మున్సిపల్‌ కమిషనర్‌ శ్రావణ్‌ కుమార్‌ 27మంది కార్మికులను చేర్చుకొని వారికి జీతాలు ఎలా పెడతారని ప్రశ్నించారు. జిల్లా ఆప్కాస్‌లో సమాచారం తెలుసుకున్నా వీరు ఎవరు పేర్లు అక్కడ లేవని తెలిపారన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ముమ్మాటికీ ఇది ప్రభుత్వాన్ని మోసం చేయటమేనని తెలిపారు. ఈ విషయంపై నూతన ప్రభుత్వానికి తెలియజేసి త్వరలో కోర్టుకు కూడా వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ కావలి నియోజకవర్గ కార్యదర్శి కొప్పర్తి నాగరాజు, ఎఐటియుసి గౌరవ అధ్యక్షుడు చేవూరు కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️