కాల్వలో పేరుకుపోయిన వ్యర్థాలు
ప్రజాశక్తి- తాడేపల్లి : ఎమ్‌టిఎంసి పరిధిలోని తాడేపల్లి పట్టణ పరిస్థితి పేరు గొప్ప- ఊరు దిబ్బ సామెతలా ఉంది. స్వచ్ఛత నినాదం ఇక్కడ వెక్కిరింతకు గురవుతోంది. బైపాస్ రోడ్డు అపార్ట్మెంట్ ముందు మురుగుపారుదల సౌకర్యం లేక దుర్వాసన వెదజల్లుతోంది. రెండువేల ఎకరాలకు సాగునీరు అందించే ఆంధ్రరత్న పంపింగ్ స్కీం కాల్వ వ్యర్థాలకు నిలయంగా మారింది. నిత్యం వేల మంది విద్యార్థులతో పాటు వాణిజ్య పంటలు పండించి ఇటు మంగళగిరి అటు తెనాలి తరలించే కెఎల్ యూనివర్సిటీ రోడ్డు అధ్వానంగా తయారై వెక్కిరిస్తోంది. అపార్ట్మెంట్లో నుండి వస్తున్న మురుగునీరు పోవడానికి దారి లేక దుర్గంధం వెదజల్లుతూ, దోమల బెడద ఎక్కువై ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. మురుగునంతా కృష్ణా నది, బకింగ్‌హామ్ కెనాల్‌లోకి వదులుతుండగా కొన్నిచోట్ల మోటార్ల ద్వారా తోడించి బయటకు పంపుతున్నారు. మద్యం ఏరులై పారుతున్నా తాగునీరు కటకటగా ఉంది. 30 అడుగుల్లో మంచినీరు బడే బోర్లలో కలుషిత నీరు రావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్లు నుండి కలుషిత నీరు కలుషిత నీరు రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పక్కన చేపలు, మాంస విక్రయిస్తుండగా ఆ వ్యర్థాలూ పంట కాల్వల్లోకే వస్తున్నాయి. పశుసంపద ఉన్నా వాటికి సరైన వైద్యసదుపాయాలు లేవు. కుంచనపల్లి, మెల్లెంపూడి, పాతూరు, గుండెమెడ, చిరావూరు గ్రామాల్లోని పొలాలు వ్యర్థాలతో నిండి దుర్గంధం వెదజల్లుతూ రైతులు పనులు చేసుకోవడానికీ వీలవడం లేదు. ఈ సమస్యలేమీ పట్టని ప్రభుత్వాలు, అధికారులు పన్నులు మాత్రం విపరీతంగా పెంచుతున్నారని ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.
