పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి వెలిగొండ అవశ్యం

ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్‌ : వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే పశ్చిమ ప్రకాశం ప్రాంతం అభివృద్ధి అవుతుందని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. గిద్దలూరు యుటిఎఫ్‌ కార్యాల యంలో ఆదివారం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) జిల్లా కార్యవర్గ సభ్యులు పరదేశి రాజశేఖర్‌ ఆధ్వర్యంలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజశేఖర్‌ మాట్లాడుతూ ఈ నెల 24న జరగబోయే శాసనసభ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి రెండు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించేలాగా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఒప్పించాలని జిల్లా శాసనసభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అన్ని మండల కేంద్రాల వద్ద ఈ నెల 20న ర్యాలీ, నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు టి ఆవులయ్య మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌, హెడ్‌ రెగ్యులేటర్‌, గేట్లు బిగింపులు పూర్తయ్యాయని, ఇక మిగిలింది వెలిగొండ నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పరిహారం చెల్లింపు, స్వల్పనిర్మాణ పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని అన్నారు. వచ్చే వరద సీజన్‌ నాటికి నీరు విడుదలకు అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో తక్షణం నీటి విడుదలకు అవకాశం ఉన్న ఏకైక ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టు మాత్రమే అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 2025-26లో ప్రవేశపెడుతున్న రాష్ట్ర బడ్జెట్లో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు 2,000 కోట్ల రూపాయలు నిధులుకేటాయించి, వచ్చే వరద సీజన్‌ నాటికి వెలుగొండ ప్రాజెక్టు జలాలు విడుదలచేసి, పశ్చిమ ప్రకాశం సస్యశ్యామలం కోసం ఎమ్మెల్యేలు కృషి చేయాలని కోరారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సిఐటియు నాయకులు బి నర్సింహులు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఎం నారాయణ, వెంకటేశ్వర్లు, ముఠా కార్మిక సంఘం నాయకులు పి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️