ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ (అన్నమయ్య జిల్లా) : అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత పులి ఫారెస్ట్ అధికారుల వైఫల్యం వల్ల మృతి చెందింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని పొన్నేటిపాలెం సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పొన్నేటిపాలెం సమీపంలోని పోలాల వైపు నీటి కోసం వెళ్లిన ఆడ చిరుత ప్రమాదవశాత్తు వేటగాళ్ల వేసిన ఉచ్చులో చిక్కుకుంది. గమనించిన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారాన్ని అందించారు. ఫారెస్ట్ సిబ్బంది బీట్ ఆఫీసర్లు సుమిత, జయరాం, ఉమాదేవి, ఎఫ్‌ఆర్‌ఒ జయప్రసాద్ రావు, సబ్ డిఎఫ్‌ఒ శ్రీనివాసులు అక్కడకు చేరుకున్నారు. చిరుతను రక్షించేందుకు తీసుకోవలసిన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేయలేకపోయారు. ఉచ్చులో బిగిసుకున్న చిరుత విడిపించుకోవడానికి చాలా ప్రయత్నించింది. కొంతసేపటికి అది చిరుత మృత్యువాత పడింది. గామస్తులు ఒక్కసారిగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరుతను కాపాడేందుకు ఒక చిన్న ప్రయత్నం చేయలేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే చిరుత చనిపోయిందని విమర్శించారు. ఆఖరికి చిరుత మతదేహాన్ని కిందకి దింపి పోస్టుమార్టం నిమిత్తం పశువుల ఆస్పత్రికి తరలించారు. చిరుత గర్భంతో ఉన్నట్లు, కడుపులో రెండు పిల్లలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని అధికారులు తెలిపారు.
