పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యాన 5న సదస్సు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పాలకుల నిర్లక్ష్యం కారణంగానే విజయనగరం సమగ్రాభివృద్ధి సాధ్యం కాలేదని, ఇప్పటి కైనా నిర్లక్ష్యం వీడి సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు కోరారు. మంగళవారం స్థానిక ఎల్ బి జి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకనాడు విద్యలకు నిలయం.. కళల కానాచి చెరుకు, వరి, జనుము, మామిడి, జీడిపంటలకు ప్రసిద్ధిగాంచిన జిల్లా అని, నీటి వనరులు పుష్కలంగా ఉన్నా జిల్లా విజయనగరం అభివృద్ధికి ఆ మడ దూరంలో ఉందని అన్నారు. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరిగిపోయాయని, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని అన్నారు. సాంప్రదాయంగా ఏర్పడ్డ జ్యూట్ పరిశ్రమ, పంచదార పరిశ్రమ, ఫెర్రోఎల్లాయీస్ పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. కొత్తగా సముద్రతీరంలో వచ్చిన ఫార్మా కంపెనీలు విషజలాలు వెదజల్లి సముద్రంలోకి పంపేస్తూ పర్యావరణానికి తీవ్రహాని చేస్తున్నారన్నారు. నూతన ఆర్థిక విధానాల ఫలితంగా మల్టీ నేషన్ కంపెనీలు, బడా పెట్టుబడిదారులైన టాటా, అంబానీ, అదానీల షాపింగ్ మాల్స్ రావడంతో ఉన్న చిన్నా, చితక షాపులు మూతపడే పరిస్థితి ఉందన్నారు. వ్యవసాయానికి గిట్టుబాటు ధరల్లేక భూములు రియల్‌ఎస్టేట్ వ్యాపారుల కబంద హస్తాల్లో చిక్కుకుని పచ్చని నేల బీడుభూమిగా మారిపోయిందన్నారు. పోరాడి సాధించుకున్న మెడికల్ కాలేజీలో ముఖ్యమైన కార్డియాలజి, న్యూరాలజి, యూరాలజి విభాగాలు, కేన్సర్ టెస్టింగ్ సెంటర్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సాంస్కతిక విశ్వవిద్యాలయం కట్టాలనే ప్రజల ఆకాంక్ష నేటికీ నెరవేరలేదని చెప్పారు. గురజాడ అడిటోరియానికి రూ. 5కోట్లు కేటాయించినా నేటికీ నిర్మించలేదన్నారు. ఈనేపథ్యంలో సమగ్రాభివృద్ధికి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఏప్రిల్ 5 న జరగనున్న సెమినార్ ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ హరీష్, పట్టణ పౌర సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు రంబ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.