‘వెలిగొండ’ పట్ల నిర్లక్ష్యం విడనాడాలి

ప్రజాశక్తి -కనిగిరి : వెలిగొండ ప్రాజెక్టు పట్ల పాలకులు నిర్లక్ష్యం విడనాడాలని కోరుతూ సిపిఎం కనిగిరి పట్టణ కార్యదర్శి పిసి. కేశవరావు అధ్యక్షతన గురువారం నిరసన తెలిపారు. తొలుత పట్టణంలోని ప్రధాన వీధులలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో రాస్తారోకో చేపట్టారు. అనంతరం కనిగిరి ఆర్‌డిఒ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి.కొండారెడ్డి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయటంలో పాలకులు నిర్లక్ష్య వైఖరిని విడనాడాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు తక్షణమే రూ.2 వేల కోట్లు కేటాయించాలన్నారు. వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రాంతం అభివద్ధి చెందాలంటే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు జిల్లాకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సెప్టెంబర్‌ లోపు తగు చర్యలు తీసుకోవాలన్నాచేయాలన్నారు. లేకుంటే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి పాలన స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. మార్కాపురాన్ని జిల్లా కేంద్రగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కనిగిరి, దర్శి, మార్కాపురం ప్రాంతాలలో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. దొనకొండ పారిశ్రామిక కారిడార్‌ను అభివద్ధి చేయాలని కోరారు. కనిగిరిలో వలసల నివారణకు పరిశ్రమలు స్థాపించాలని కోరారు. పాలేటి పల్లి రిజర్వాయర్‌కు సంబంధించి పెండింగ్‌ కాల్వ పనులు పూర్తి చేయాలన్నారు. ట్రిపుల్‌ ఐటీ కళాశాలను, నడికుడి శ్రీకాళహస్తి రైల్వేలైన్‌, నిమ్స్‌ పనులు పూర్తి చేయాలని కోరారు. అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.రమేష్‌, ఊసా వెంకటేశ్వర్లు, కె.మాల్యాద్రి, సందు వెంకటేశ్వర్లు, ఆర్మాల కొండయ్య, బడుగు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్‌కె.ఖాదర్‌బాషా, పిల్లి తిప్పారెడ్డి, పి.మహేష్‌, పిచ్చయ్య, తిరుపతి రెడ్డి, నరేంద్ర, ఎస్‌కె. బషీరా, శాంత కుమారి, ప్రసన్న, ఆర్‌.ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు

➡️