ప్రజాశక్తి-దర్శి: గుంతలమయమైన రహదారులకు మరమ్మతులకు మన కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టి చక్కటి ప్రయాణానికి బాటలు వేస్తుందని టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఆర్‌అండ్‌బి రహదారుల మరమ్మతుల కార్యక్రమంలో భాగంగా శనివారం దర్శి పట్టణంలోని గడియార స్తంభం నుంచి అద్దంకి వెళ్లే రహదారులకు మరమ్మతుల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో రోడ్లను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి సంక్షేమం పేరుతో దోచుకొని రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు. రోడ్లన్నీ గుంతల మయమైనా తట్ట మట్టి కూడా పోసిన పరిస్థితులు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపిస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌అండ్‌బి రహదారులలో గుంతలు పూడ్చే కార్యక్రమానికి దాదాపు రూ.800 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మన దర్శి ప్రాంతంలో కూడా ప్రధాన రహదారుల్లో గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజల అవసరాలు తీర్చడమే మన ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, కలువకొలను చంద్రశేఖర్, ఆర్‌అండ్‌బి ఇఇ సమర్పణరావు, డిఇ గోపికృష్ణ, జెఇ రఫీ, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.గ్రామీణ రోడ్లకు మహర్దశ కురిచేడు: తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణ రోడ్లకు మహర్దశ వచ్చిందని టిడిపి దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శనివారం ఆమె కురిచేడు నుంచి దొనకొండ వరకు రోడ్డు మరమ్మతు పనులను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రోడ్ల మరమ్మతులు చేయడానికి 800 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిందని, ఈ నిధులలో దర్శి నియోజకవర్గంలో ఉన్న ఆర్‌అండ్‌బి రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నామని ఆమె అన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఏ రోడ్లకు ఒక చిన్న మరమ్మతు చేయలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు పడుతున్న బాధలను ప్రత్యక్షంగా చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయడం హర్షణీయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట దర్శి మాజీ శాసన సభ్యులు నారపుశెట్టి పాపారావు, మండల పార్టీ అధ్యక్షులు నెమలయ్య, మాజీ అధ్యక్షులు మొఘల్ మస్తాన్‌వలి, కాట్రాజు నాగరాజు, గడ్డం బాలయ్య, జిల్లా డాక్టర్స్ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ సునీల్, టిడిపి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.