పోలీసులు, లాయర్ల తోపులాట

Jan 11,2025 00:07

ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : పొన్నూరులో న్యాయవాది బేతాళం ప్రకాశరావును పోలీసు అధికారులు కొట్టిన ఘటనలో కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు నాలుగు రోజులుగా చేస్తున్న ఆందోళన శుక్రవారం తీవ్రరూపం దాల్చింది. విధులను బహిష్కరించిన న్యాయవాదులంతా బయటకు వచ్చి నిరసనలో పాల్గొన్నారు. రోడ్డుపై పొన్నూరు ఎస్‌ఐ దిష్టిబొమ్మను దహనం చేశారు. విధులకు హాజరవుతున్న మినీష్టిరీయల్‌ ఉద్యోగులను కూడా అడ్డుకున్నారు. ప్రధాన గేట్లను మూసి వేసి ఎవ్వరినీ లోపలికి వెళ్లకుండా నిరోధించారు. ఈ దశలో విధి నిర్వహణలో ఉన్న ఒక కానిస్టేబుల్‌ ఆందోళనను వీడియో తీస్తుండగా ఆయన్ను న్యాయవాదులు అడ్డుకున్నారు. వీడియోను డిలీట్‌ చేయాలని వత్తిడి చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. ఉన్నతాధికారులకు సమాచారం పంపడం తన బాధ్యతని కానిస్టేబుల్‌ చెప్పినా వీడియో డిలీట్‌ చేయాల్సిందేనని న్యాయవాదులు పట్టుబట్టారు. ఈ సమయంలో కోర్టు ప్రాంగణంలోకి వచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్ధసా రధిని చూసి న్యాయవాదులు వైదొలిగారు. న్యాయమూర్తి సూచన మేరకు మినీస్టిరియల్‌ ఉద్యోగులను విధులకు అనుమతించారు. న్యాయవాది ప్రకాశరావుపై దాడి కేసులో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోనందుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి నిరవధికంగా కోర్టులను బహిష్కరిస్తున్నట్టు జిల్లా బార్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు కాసు వెంకటరెడ్డి తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించక పోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

➡️