ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : ప్రేమించుకున్న యువతీ యువకులు తల్లిదండ్రులకు తెలియకుండా ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి రైల్లో పారిపోతూ ఉండగా ఏలూరు రైల్వే పోలీసులు వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం ఏలూరు రైల్వే ఎస్సై సైమన్ తెలిపిన వివరాలు ప్రకారం … వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని జల్పై గురి ప్రాంతానికి చెందిన రబీనా పర్వీన్ (22) అదే ప్రాంతానికి చెందిన అమ్మినూర్ ఇస్లాం గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు సరి కదా పర్వీన్ కు వేరొక వివాహం చేయాలని నిశ్చయించారు. దీంతో పర్వీన్ ఇస్లాం ఇద్దరూ తల్లిదండ్రులకు తెలియకుండా చెన్నై వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. రైలు నెంబర్ 128 39 చెన్నై సెంట్రల్ రైల్లో వారు చెన్నై వెళ్లడానికి బయలుదేరారు. సమాచారం అందుకున్న ఏలూరు రైల్వే ఎస్సై సైమన్ వారిని ఏలూరు రైల్వే స్టేషన్ లో గుర్తించి పర్వీన్ ను ఏలూరు వన్ షాప్ సెంటర్ కు తరలించారు. శనివారం పర్వీన్ తండ్రి బబ్లు మొహమ్మద్ ఏలూరు నగరానికి రావడంతో ఆమెను తండ్రికి అప్పగించారు. ఇస్లాంను అతడి సోదరుడికి అప్పగించారు. వీరిద్దరికీ వారి బంధువులకు ఏలూరు రైల్వే ఎస్సై సైమన్ కౌన్సిలింగ్ ఇచ్చి వారి స్వగ్రామానికి పంపివేశారు.