పోలింగ్‌ ముగిసినా చల్లారని రాజకీయ వేడి

May 16,2024 00:08

పిడుగురాళ్లలో మూతబడ్డ దుకాణాలు
ప్రజాశక్తి-పిడుగురాళ్ల :
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసినా గురజాల నియోజకవర్గంలో రాజకీయం మాత్రం రోజురోజుకి వేడెక్కుతుంది. ఎన్నికల రోజు ప్రారంభంమైన గోడవలు దావానంలా నియోజకవర్గం మెత్తం వ్యాపిస్తున్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా నియోజకవర్గంలో దాడులు జరుగుతుంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. గత ఎన్నికల్లో గురజాల నియోజకవర్గంలో 79 వాతం పోలింగ్‌ నమోదవ్వగా ఈసారి 83 శాతానికి పెరిగింది. నూతనంగా ఏర్పాటైన పల్నాడు జిల్లాలో అత్యధిక పోలింగ్‌ శాతం గురజాల నియెజకవర్గంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే పోలింగ్‌తోపాటు ఘర్షణలు కూడా గతంలో కంటే ఎక్కువుగా పెరగడం ప్రజల్ని కలవరపెడుతోంది. పోలింగ్‌ రోజున దాచేపల్లి మండలంలోని నడికుడి, కేశానుపల్లి, ఇరికేపల్లి, తంగెడ, దాచేపల్లి పట్టణం తదితర ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. పిడుగరాళ్ల మండలంలోని జానపాడులో స్వల్ప వివాదాలు తలెత్తాయి. బ్రహ్మణపల్లిలో వైసిపి సర్పంచ్‌ మాబు కారును టిడిపికి చెందినవారు ధ్వంసం చేసి నిప్పంటించారు. మాచవరం మండలం వేమవరంలో చిన్నపాటి వివాదాలు జరిగాయి. కొత్తగణేశునిపాడులో పోలింగ్‌ రోజైన సోమవారం రాత్రి వైసిపి సానుభూతిపరులైన బీసీ సామాజిక తరగతికి చెందిన కుటుంబాలపై టిడిపికి చెందిన పెత్తందారీ సామాజిక తరగతివారు దాడులకు తెగబడ్డారు. బీసీ ఇళ్లపై 100 మందికి పైగా పెత్తందార్లు కర్రలు, ఇనుప రాడ్లతో దాడులు చేసి దమనకాండకు పూనుకున్నారు. దీంతో బాధితులంతా మహిళలు, వృద్ధులు, చిన్నారులను వెంటబట్టుకొని ప్రాణభయంతో ఇళ్లు వదిలి ప్రాణాలు గుపెట్లో పెట్టుకొని పొలాల వెంట పారిపోయారు. మరికొందరు గ్రామ శివారులోని గంగమ్మ దేవాలయంలోనే తలదాచుకున్నారు. ఎవరు వచ్చి దాడి చేస్తారో అని రాత్రంతా బిక్కుబిక్కు మంటూ బతికారు. మంగళవారం ఉదయం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అభ్యర్థి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ గ్రామానికి వచ్చారు. భాదితులను పరామిర్శించేందుకు వారు పదులు సంఖ్యలో కార్లతో రావడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు గ్రూపులు దాడులు చేసుకునేందుకు కవ్విపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని ఇరు పక్షాలకు సర్దిచెప్పారు. అనంతరం గ్రామం నుండి బయలుదేరిన వైసిపి కాన్వాయిపై టిడిపి శ్రేణులు నాయకులు రాళ్ల దాడి చేశారు. ఇదిలా ఉండగా వైసిపి మాచవరం మండల అధ్యక్షులు చౌదరి సింగరయ్య, మరో నాయకుడు దారం లచ్చిరెడ్డిపై మంగళవారం రాత్రి సమయంలో కర్రలతో రాళ్ళతో దాడి చేయగా వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి కాళ్లు, చేతులు విరిగడంతో వారిని పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. బుధవారం ఉదయం దాచేపల్లి మండలంలోని మాదినపాడులో వైసిపికి చెందిన ఆదిరెడ్డిపై టిడిపికి చెందిన వ్యక్తులు దాడి చేయడంతో ఆదిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. రోజురోజుకూ దాడులు పెరుగుతుండటంతో జిల్లా పోలీస్‌ అధికారులు గురజాల నియోజకవర్గంలో 144సెక్షన్‌ అమలు చేశారు. నియెజకవర్గంలో మూడ్రోజులపాటు వ్యాపారాలు నిలిపివేయాలని దుకాణదార్లను ఆదేశించారు. నియోజకవర్గంలో పరిస్ధితి అదుపులోకి తెచ్చేందుకు ప్రత్యేక బలగాలతో గస్తీ నిర్వహిస్తున్నారు.
హింసకు పాల్పడితే కఠిన చర్యలు
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : హింసకాండకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సిఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పట్టణంలో 144వ సెక్షన్‌ విధించినట్లు బుధవారం సిఐ తెలిపారు. ఎన్నికల అనంతరం జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సత్తెనపల్లి పట్టణంలో మూడ్రోజుల పాటు దుకాణాలు ముసివేయాలని వ్యాపార వర్గాలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సత్తెనపల్లి పట్టణంలో నలుగురు కంటే ఎక్కువ గుమ్మిగూడితే చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు దగ్గరుండి దుకాణాలు ముయించారు. దీంతో సత్తెనపల్లి పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. దుకాణాలు మూసివేతతో నిత్యం రద్దీగా ఉండే వ్యాపార కూడళ్లు వెలవెలబోతున్నాయి.
రాజకీయ అల్లర్లు.. చిరువ్యాపారులకు ఇక్కట్లు
ప్రజాశక్తి – మాచర్ల :
ఎన్నికల సందర్భంగా మాచర్ల పట్టణంలో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో పోలీసులు వ్యాపార సముదాయాలను మూసివే యంచటంతో చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు గురిఅవుతున్నారు. పట్టణంలో రోడ్డు పక్కన నెట్టుడు బండ్లపై వ్యాపారాలు చేసుకొనేవారి వందల సంఖ్యలో ఉంటారు. పూలు, కూరగాయాలు, టిఫెన్‌ సెంటర్లను నడుకునేవారు. అకస్మాత్తుగా వ్యాపారాలు నిలిపివేయటంతో సరుకు పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరటి, మామిడి, కూరగాలయల వంటి పచ్చి సరుకు అమ్ముకునేవారు రెండు రోజులు నిల్వవుండే పండ్లు పాడవుతాయని ఆవేదన చెందుతున్నారు. కూరగాయల మార్కెట్‌ కూడా బుధవారం, గురువారం తీయవద్దని పోలీసులు చెప్పటంతో నిల్వవున్న సరుకు పాడవుతుందని, ఏ రోజుకారోజు వచ్చే ఆదాయంపై బతికే వారికి తీవ్ర నష్టమని వాపోతున్నారు.

➡️