ప్రజాశక్తి-చీమకుర్తి : సంతనూతలపాడు, చీమకుర్తి మండలాల్లోని చెరువులన్నిటినీ సాగర్ నీటితో నింపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం స్థానిక పంగులూరి కృష్ణయ్య భవనంలో జరిగిన రైతు సంఘం మండల కమిటీ సమావేశానికి బెజవాడ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా పొలాలకు పోయే పశువులకు, పశువుల మేతకు నీటి అవసరం ఉందని అన్నారు. చెరువులన్నిటినీ సాగర్ నీటితో నింపితే సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రభుత్వ విధానాల వలన అన్ని పంటలకు రేట్లు తగ్గిపోయి నష్టపోతున్నారని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెలిసి మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత రెండు సంవత్సరాలుగా పొగాకుకు రేటు ఉన్నందున ఈ ఏడాది రైతులు ఎక్కువ ఖర్చు పెట్టి సాగు చేశారని పేర్కొన్నారు. కిలో రూ.300 ఉంటేనే గిట్టుబాటు అవుతుందని, ప్రస్తుతం ఉన్న రేట్లు రైతులను నిరుత్సాహానికి గురి చేస్తున్నాయని అన్నారు. పొగాకు బోర్డు, ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం రూ.20,000 విడుదల చేయలేదని అన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి క్రిష్టిపాటి చిన్నపురెడ్డి, జిల్లా నాయకులు కొల్లూరి వెంకటేశ్వర్లు, మండల నాయకులు కుమ్మిత శ్రీనివాసులురెడ్డి, ఆంజనేయరెడ్డి, కొల్లూరి అక్కయ్య, మాదాల నరసింహారావు, ఆంజనేయులు పాల్గొన్నారు.
