ప్రజాశక్తి – కడప జిల్లాలో పోష్ -2013 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిఆర్‌ఒ గంగాధర్ గౌడ్ అధికారులను సూచించారు. శుక్రవారం గ్రీవెన్స్ హాల్‌లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ (పోష్ ఆక్ట్-2013)పై శిక్షణ కార్యక్రమం డిఆర్‌ఒ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపుల పై పోష్ చట్టం రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ఈ చట్టంపై ప్రతి మహిళా అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి జిల్లా స్థాయిలో లోకల్ కంప్లైంట్ కమిటీని(ఎల్‌సిసి) ఏర్పాటు చేశామని చెప్పారు. కమిటీకి చైర్ పర్సన్‌గా స్పెషల్ కలెక్టర్ కౌసర్ భాను, కన్వీనర్‌గా ఐసిడిసి పీడీ శ్రీలక్ష్మి వ్యవహరిస్తారని, ఇద్దరు ఇతర సభ్యులు ఎక్స్‌ఆఫిషియో సభ్యులు ఉంటారని తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేట్ (ఆర్గనైజ్డ్,అనార్గనైజ్డ్) సంస్థల్లో పని చేస్తున్న ప్రతి మహిళకు ఈ చట్టం వర్తిస్తుందని తెలిపారు. పదిమంది పైగా ఉద్యోగులు పనిచేసే ప్రతి ప్రభుత్వ సంస్థల్లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ (ఐసిసి)ని చైర్ పర్సన్ ముగ్గురు సభ్యులతో తప్పకుండా ఏర్పాటు చేయాలన్నారు. పదిమంది కంటే తక్కువ పని చేసే సంస్థల్లో ఎవరైనా మహిళలు వేధింపులకు గురైతే మున్సిపాల్టీ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ కు, మండల స్థాయిలో తహశీల్దార్‌కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత వ్యక్తికి ఏడు రోజుల లోపల నోటీసు ఇచ్చి 90 రోజుల్లో విచారణ పూర్తి చేసి లోకల్ కంప్లైంట్ కమిటీకి రిపోర్టు పంపించాలని తెలిపారు. ఇందుకు సంబంధించి బాధిత మహిళ వివరాలు గోప్యంగా ఉంచుతారని చెప్పారు. .పోష్ ఆక్ట్ కన్వీనర్ ఐసిడిఎస్ పీడీ శ్రీ లక్ష్మీ మాట్లాడుతూ1997 సంవత్సరలో రాజస్థాన్‌లోని భన్వారీ దేవి అనే మహిళా ఉద్యోగి లైంగిక వేధింపులకు గురైన నేపథ్యంలో సుప్రీంకోర్టు పోష్ ఆక్ట్ 2013 మార్గదర్శకాలు రూపొందించారని చెప్పారు. పోష్ యాక్ట్‌పై ఏవైనా సందేహాలు ఇబ్బందులు ఉన్న ఐసిడిఎస్ అడ్వకేట్లను సంప్రదించవచ్చునని తెలిపారు. అలాగే చిన్నపిల్లల సమస్యలపై 1098 మహిళల సమస్యలపై 181, 112 టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా ఫోన్ చేసి సమస్యలను తెలియపరచవచ్చునని అన్నారు. శిక్షణ కార్యక్రమం అనంతరం డిఆర్‌ఒ గంగాధర్ గౌడ్ చేతులమీదుగా పోష్ చట్టం-2013 పోస్టర్లను విడుదల చేశారు. సమావేశంలో దిశా డిఎస్‌పి రమాకాంత్, కడప ఇన్‌ఛార్జి ఆర్‌డిఒ వెంకటపతి, జమ్మలమడుగు ఆర్‌డిఒ శ్రీనివాసులు, విద్యా శాఖ అధికారి అనురాధ, సోషల్ వెల్ఫేర్ డిడి సరస్వతి, అడా వైస్ చైర్మన్ నందన్, డిఆర్‌డిఎ, మెప్మా పీడీలు ఆనంద్ నాయక్, సురేష్, బీసీ వెల్ఫేర్ వెల్ఫేర్ అధికారి బ్రహ్మయ్య, ఇతర జిల్లా అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
