మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

Jun 8,2024 21:39

 ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌ : మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు కొత్త ప్రభుత్వం పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి కోరారు. ఈ మేరకు ఈనెల 8న స్థానిక సుందరయ్య భవనంలో శనివారం మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం నాయకులు డ్రైవరమ్మ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సులో రమాదేవి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పరిష్కరించే దిశగా ఆలోచించాలని కోరారు. చాలీచాలని జీతాలతో బతుకులు నెట్టుకొస్తున్నారన్నారు. ఇన్సూరెన్స్‌, గుర్తింపు కార్డులు, వంట షెడ్డులు, ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్‌, మెనూ చార్జీల పెంపు, కాటన్‌ చీరలు, ఉద్యోగ భద్రత లాంటి సమస్యల పరిష్కారానికి కొత్త ప్రభుత్వం ఎంతో ఆశగా ఎదురుచూస్తుందని అన్నారు. నిత్యవసర వస్తు ధరలు పెరుగుతున్నాయని, వైద్యం ఖర్చు పెరిగిందని, కావున కొత్త ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. యూనియన్‌ జిల్లా కార్యదర్శి వై.శాంతి కుమారి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు అనేకమని, వాటంటినీ పరిష్కరించి, తమకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, కోశాధికారి గొర్లి వెంకటరమణ, నాయకులు గవర వెంకటరమణ, భవాని, లక్ష్మీ, పావని తదితరులు పాల్గొన్నారు

➡️