ప్రజాశక్తి – రాయచోటి టౌన్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.వి.రమణ అన్నారు. 36 జిఒను ఇంజినీరింగ్ కార్మికులకు అమలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో కూర్చున్న ఐదు మంది కార్మికులకు పూలమాలలు వేసి రమణ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సి పాలిటీలలో వాటర్ సెక్షన్ ఫిట్టర్ ఎలక్ట్రీషియన్లు ఏడు సంవత్సరాల నుండి వేతనాలు పెంచలేదన్నారు. 15 నుండి 20 సంవత్సరాల నుండి పని చేస్తున్నా కేవలం రూ.15 వేల వేతనంతో పనిచేస్తున్నారని తెలిపారు. పెరిగిన ధరలకనుగునంగా కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేసి హెల్త్ అలవెన్సులు ఇవ్వాలన్నారు. రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్, ఫెన్షన్ గ్రాట్యూటీ, మట్టి ఖర్చులు జీ ఓ లతో క్యాజువల్ లీవులు, క్లాప్ డ్రైవర్ల వేతనాల పెంపుదల కోసం భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కార్మికులు శంకరయ్య, దేవా, మల్లికార్జున, ఖాదర్ వలి, శ్రీనివాసులు, అక్బర్, చంద్రశేఖర్, షకీల్ బేగ్ పాల్గొన్నారు. రాజంపేట అర్బన్ :మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పురపాలక కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేశామని, తమ ప్రభుత్వం వచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు. పురపాలక శాఖ మంత్రిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పి.వి రమణ, జి.రమణ, ఎ.బాలాజీ, ఎం.వి.రమణ, కోదండమయ్య, బుజ్జమ్మ, కె.ప్రసాద్, లక్ష్మీదేవి పాల్గొన్నారు.