ప్రజాశక్తి-చీమకుర్తి : ప్రభుత్వం మున్సిపల్ కార్మికులతో చేసుకున్న ఒప్పందాలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పూసపాటి వెంకటరావు, పల్లాపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గతంలో 16 రోజుల పాటు జరిగిన సమ్మె సందర్భంగా కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలు కాని దహన సంస్కారాలు, ఎక్స్‌గ్రేషియా పెంపు జీవోలు నేటికీ విడుదల కాలేదని అన్నారు. పదేళ్ల సర్వీసు పూర్తయిన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోవిడ్ కార్మికులను ఆప్కాస్‌లో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పి పద్మ, ఏడుకొండలు, నరసయ్య, గోవిందు, దాసు, కోటయ్య, పిచ్చయ్య, సుబ్బరత్తమ్మ, కళ్యాణి, కోటేశ్వరి, ఆంద్రీ పాల్గొన్నారు.
