నెల్లూరు : నెల రోజులకు పైగా గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్ల సమ్మె పోరాటంలో భాగంగా నెల్లూరు జిల్లాలోని టీచర్లు మంగళవారం ఉదయం నెల్లూరు సిటీ నడిబొడ్డు స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ లో ” బిక్షాటన కార్యక్రమం ” నిర్వహించారు. తొలుత స్వతంత్ర పార్క్ వద్ద నుండి ర్యాలీ గా నినాదాలు చేస్తూ గాంధీ బొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ, అనంతరం గాంధీ బొమ్మ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్, సండే మార్కెట్ వీధిలో షాపుల వద్ద టీచర్లు బిక్షాటన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా గిరిజన గురుకుల పాఠశాలల టీచర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కేవీ రమణ, జిల్లా నాయకులు ఎం.బుజ్జమ్మ మాట్లాడారు. గిరిజన గురుకుల పాఠశాలల్లో అనేక సంవత్సరాల నుండి ఔట్సోర్సింగ్ పద్ధతిలో చాలీచాలని జీతాలతో టీచర్లుగా పనిచేస్తున్నామని అన్నారు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఏ పాఠశాలల్లో లేని విధంగా డ్యూటీలు చేస్తున్నామని అన్నారు. అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న మా సర్వీసును గుర్తించకుండా కూటమి ప్రభుత్వం గిరిజన గురుకులాల టీచర్ పోస్టులను డీఎస్సీలో కలపడం సరైన చర్య కాదని అన్నారు. గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ టీచర్లును పర్మినెంట్ చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత నెల రోజుల నుండి క్లాసులు జరగకపోవడంతో గిరిజన గురుకులాల్లోని పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మేము వీధుల్లో తిరిగి భిక్షాటన చేయాల్సిన పరిస్థితికి ప్రభుత్వం మమ్మల్ని తీసుకురావడం పట్ల చాలా బాధాకరంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మా సమస్యల పై స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు తార, నాయకులు శ్రీనివాసులు, సునీల్,క్రిష్ణ, ప్రదీప్, శ్రీనివాస రావు, శివయ్య, మహమ్మదా, రాజ్యలక్ష్మి, సుభహాని తదితరులు పాల్గొన్నారు.
గిరిజన గురుకుల పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ టీచర్ల సమస్యల్ని పరిష్కరించాలి : బిక్షాటన కార్యక్రమం చేపట్టిన టీచర్లు
